YSRCP: 175 స్థానాలూ గెలుస్తామన్న ధీమాతో 2024 ఎన్నికలకు వెళుతున్నాం!: విజయసాయిరెడ్డి
- సజ్జలతో కలిసి ప్లీనరీ జరిగే ప్రాంతాన్ని పరిశీలించిన సాయిరెడ్డి
- ‘కిక్ బాబు అవుట్.. గెట్ ది పవర్.. సర్వ్ ది పీపుల్’ నినాదంతో ఎన్నికలకు వెళతామని ప్రకటన
- 2017లోనూ ఇక్కడే ప్లీనరీ నిర్వహించామన్న వైసీపీ ఎంపీ
2024 ఎన్నికల్లో వైసీపీ లక్ష్యం, నినాదం ఏమిటన్న విషయాలపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయిరెడ్డి బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలోని మొత్తం 175 స్థానాలను గెలుస్తామన్న ధీమాతోనే 2024 ఎన్నికలకు వెళుతున్నామని ఆయన వెల్లడించారు. ఈ మేరకు బుధవారం పార్టీ ప్లీనరీ నిర్వహణ కోసం ఎంపిక చేసిన స్థలాన్ని పరిశీలించిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ మూడో ప్లీనరీని జులై 8, 9 తేదీల్లో గుంటూరు జిల్లా పరిధిలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో నిర్వహించనున్నట్లు ఇదివరకే వైసీపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం పార్టీ మరో ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం తదితరులతో కలిసి సాయిరెడ్ది ప్లీనరీ జరిగే ప్రాంతాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ ప్లీనరీకి లక్షలాది మంది కార్యకర్తలు హాజరు కానున్నారని సాయిరెడ్డి చెప్పారు. ‘కిక్ బాబు అవుట్.. గెట్ ది పవర్.. సర్వ్ ది పీపుల్’ అనే నినాదంతో 2024 ఎన్నికలకు వెళుతున్నామని ఆయన చెప్పారు. 2024 ఎన్నికల్లో గెలిచి తీరతామని చెప్పిన సాయిరెడ్డి... మరోమారు ప్లీనరీని మరింత ఘనంగా నిర్వహించుకుంటామని వెల్లడించారు. గతంలో ఇదే ప్రాంతంలో 2017లో ప్లీనరీని నిర్వహించి 2019 ఎన్నికల్లో విజయం సాధించామని ఆయన గుర్తు చేశారు.