Raghu Rama Krishna Raju: రఘురామకృష్ణరాజును విచారించడానికి సీఐడీకి ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
- హైదరాబాద్ లోని దిల్ కుషా గెస్ట్ హౌస్ లో విచారణ జరపాలని ఆదేశం
- ఆయన లాయర్ సమక్షంలోనే విచారణకు అనుమతి
- ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు మాత్రమే విచారణ
- సీఐడీ కార్యాలయానికి పిలిపించకూడదని కండిషన్
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజుపై ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసును విచారించేందుకు ఏపీ హైకోర్టు అనుమతిని ఇచ్చింది. ఆయనపై నమోదైన రాజద్రోహం నేరం మినహా ఇతర సెక్షన్ల కింద విచారణ జరుపుకోవచ్చని చెప్పింది. హైదరాబాద్ లోని దిల్ కుషా గెస్ట్ హౌస్ లో రఘురాజు లాయర్ సమక్షంలో విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసింది.
కేవలం కేసుకు సంబంధించిన అంశాల గురించి మాత్రమే విచారణ జరపాలని... ఇతర అంశాల గురించి ప్రశ్నించకూడదని సూచించింది. సీఐడీ కార్యాలయానికి పిలిపించకూడదని చెప్పింది. తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే బాధ్యులైన పోలీస్ అధికారులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారణ జరపాలని ఆదేశించింది.