Maharashtra: మహారాష్ట్ర సీఎం పదవికి ఉద్ధవ్ థాకరే రాజీనామా
- రేపు మహారాష్ట్ర అసెంబ్లీలో బల పరీక్ష
- బల పరీక్షకు ముందే సీఎం పదవికి ఉద్ధవ్ రాజీనామా
- ఫేస్బుక్ లైవ్ ద్వారా ప్రకటించిన శివసేన చీఫ్
- తమ ప్రభుత్వ పతనం వెనుక కేంద్రం కుట్ర ఉందని ఆరోపణ
మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే రాజీనామా చేశారు. ఈ మేరకు బుధవారం రాత్రి 9.40 గంటలకు ఫేస్బుక్ లైవ్ ద్వారా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వెరసి గురువారం అసెంబ్లీలో జరగాల్సిన బల పరీక్షకు ముందే ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఫలితంగా రేపు మహారాష్ట్ర అసెంబ్లీలో బల పరీక్షే అవసరం లేకుండా పోయింది.
సీఎం పదవికి రాజీనామాను ప్రకటించిన సందర్భంగా ఉద్ధవ్ థాకరే పలు కీలక అంశాలను ప్రస్తావించారు. శివాజీ మహారాజ్ ఆశయాలతో పాటు బాలా సాహెబ్ ఆశయాలను కొనసాగిస్తామని ప్రకటించిన ఉద్ధవ్... తమ ప్రభుత్వం పతనం వెనుక కేంద్రం కుట్ర ఉందని ఆరోపించారు. తనకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బల పరీక్షకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నట్లు ఆయన చెప్పారు.