AP High Court: జడ్జీలపై అనుచిత వ్యాఖ్యలు చేయలేదు... సీబీఐ అరెస్ట్ చేయకుండా ఆదేశించండి: హైకోర్టులో ఆమంచి పిటిషన్
- జడ్జీలపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో ఆమంచిపై సీబీఐ కేసు
- ఇప్పటికే ఓ దఫా సీబీఐ విచారణకు హాజరైన ఆమంచి
- మరోమారు విచారణకు రావాలంటూ ఆయనకు సీబీఐ సమన్లు
- కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో ఆమంచి క్వాష్ పిటిషన్
- తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసిన కోర్టు
వైసీపీ కీలక నేత, ప్రకాశం జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ గురువారం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. న్యాయ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఆమంచిపై సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ కేసులో ఇప్పటికే ఓ దఫా ఆమంచిని విచారించిన సీబీఐ... మరోమారు విచారణకు రావాలంటూ ఇటీవలే ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో ఈ కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో ఆమంచి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
న్యాయ వ్యవస్థపైనా, జడ్జీలపైనా తాను అనుచిత వ్యాఖ్యలు చేయలేదని సదరు పిటిషన్లో హైకోర్టుకు ఆమంచి తెలిపారు. అంతేకాకుండా తనను సీబీఐ అధికారులు అరెస్ట్ చేయకుండా దర్యాప్తు సంస్థకు ఆదేశాలు ఇవ్వాలని కూడా ఆయన హైకోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించి గురువారం విచారణ కూడా చేపట్టింది. విచారణ సందర్భంగా ఈ కేసులో తదుపరి చర్యలు తప్పకుండా ఉంటాయని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు. దీంతో ఆమంచి పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించిన కోర్టు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.