TDP: క‌ఠారి దంప‌తుల హ‌త్య కేసు విచార‌ణ నుంచి త‌ప్పుకుంటాన‌న్న ఏపీపీ... కుద‌ర‌ద‌న్న చిత్తూరు కోర్టు

chittoor court dismisses app petition in katari mohan murder case

  • చిత్తూరులో క‌ఠారి మోహ‌న్ దంప‌తుల హ‌త్య‌
  • కేసుపై చిత్తూరు కోర్టులో కొన‌సాగుతున్న విచార‌ణ‌
  • ఇటీవ‌లే సీజేఐ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌ను క‌లిసిన క‌ఠారి మోహ‌న్ కోడ‌లు
  • విచార‌ణ తుది ద‌శ‌కు చేరుకున్న స‌మ‌యంలో ఏపీపీ పిటిష‌న్‌

చిత్తూరు మేయ‌ర్ క‌ఠారి అనురాధ‌, ఆమె భ‌ర్త మోహ‌న్‌ల హ‌త్య కేసు విచార‌ణ‌కు సంబంధించి గురువారం ఓ కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచార‌ణ నుంచి త‌ప్పుకుంటానంటూ అద‌న‌పు ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ చిత్తూరు కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్‌పై గురువారం విచార‌ణ చేప‌ట్టిన చిత్తూరు కోర్టు... కేసు విచార‌ణ కీల‌క ద‌శ‌కు చేరుకున్న ద‌రిమిలా కేసు విచార‌ణ నుంచి త‌ప్పుకోవ‌డం కుద‌ర‌ద‌ని ఏపీపీకి తేల్చి చెప్పింది. కేసు ముగిసేదాకా విచార‌ణ‌లో పాలుపంచుకోవాల్సిందేన‌ని కూడా ఏపీపీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

చిత్తూరు న‌గ‌రంలో టీడీపీలో కీల‌క నేత‌గా ఎదిగిన క‌ఠారి మోహ‌న్‌... 2013లో జ‌రిగిన న‌గ‌ర పాల‌క సంస్థ ఎన్నిక‌ల్లో టీడీపీని విజ‌య‌తీరాల‌కు చేర్చారు. ఈ క్ర‌మంలో మోహ‌న్ భార్య అనురాధ‌ చిత్తూరు మేయ‌ర్‌గా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. అయితే అప్ప‌టికే ప‌లువురితో వ‌ర్గ పోరును సాగిస్తున్న మోహ‌న్‌పై దాడికి ప‌క్కా ప్లాన్ వేసిన ప్ర‌త్య‌ర్థులు మోహన్‌తో పాటు అనురాధ‌ను మేయ‌ర్ చాంబ‌ర్‌లోనే హ‌త్య చేశారు. ఈ హ‌త్య‌లో క‌ఠారి మోహ‌న్ అల్లుడు చింటూ రాయ‌ల్ ప్ర‌త్యక్షంగా పాలుపంచుకోవ‌డం గ‌మ‌నార్హం. 

ఈ కేసు విచార‌ణ సుదీర్ఘ కాలంగా కొన‌సాగుతున్న నేప‌థ్యంలో ఇటీవ‌లే తిరుప‌తి వ‌చ్చిన సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌ను క‌ఠారి మోహ‌న్ కోడలు క‌లిశారు. కేసు విచార‌ణ త్వ‌రిత‌గతిన ముగిసేలా అధికారుల‌కు ఆదేశాలు జారీ చేయాల‌ని ఆమె సీజేఐని కోరారు. ఈ క్ర‌మంలో కేసు విచార‌ణలో ఒకింత వేగం క‌నిపించ‌గా... ఈ కేసు విచార‌ణ నుంచి త‌న‌ను త‌ప్పించాలంటూ ఏపీపీ పిటిష‌న్ వేయ‌డం గ‌మ‌నార్హం.

  • Loading...

More Telugu News