USA: 'శాండ్ విచ్'పై గొడవ.. రెస్టారెంట్ సిబ్బందిపై కాల్పులు జరిపిన కస్టమర్.. ఒకరి మృతి!
- సబ్ వే రెస్టారెంట్ లో వెన్న తరహాలో ఉండే మేయో విషయంపై వివాదం
- ఆగ్రహంతో ఉన్మాదిలా మారిన కస్టమర్
- ఇద్దరు మహిళా సిబ్బందికి గాయాలు.. వారిలో ఒకరు మృతి
- కుమారుడి కళ్ల ముందే తల్లి మృతి చెందడంతో తీవ్ర విషాదం
ఓ 36 ఏళ్ల వ్యక్తి అమెరికాలోని అట్లాంటాలో ఉన్న సబ్ వే రెస్టారెంట్ కు వచ్చాడు. శాండ్ విచ్ కావాలని ఆర్డర్ చేశాడు. కాసేపటికి ఓ మహిళా సర్వర్.. శాండ్ విచ్ తెచ్చి అతడికి ఇచ్చింది. కానీ ఆ శాండ్ విచ్ లో మేయో (గుడ్డు సొన, నూనెలతో చేసే వెన్న వంటి క్రీమ్) చాలా ఎక్కువగా ఉందని వాదనకు దిగాడు.
మహిళా సర్వర్ సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా అతను వినలేదు. ఇంతలో మరో మహిళా సర్వర్ అక్కడికి వచ్చి ఆమె కూడా సర్ది చెప్పేందుకు ప్రయత్నించింది. కానీ అప్పటికే తీవ్ర ఉన్మాదంలోకి వెళ్లిపోయిన కస్టమర్.. తన వద్ద ఉన్న తుపాకీ తీసి ఇద్దరు మహిళా సిబ్బందిపై కాల్పులు జరిపాడు. దీంతో 26 ఏళ్ల మహిళా సర్వర్ అక్కడికక్కడే చనిపోగా.. మరో మహిళా సర్వర్ తీవ్రంగా గాయపడింది.
దారుణమేమిటంటే.. చనిపోయిన మహిళా సర్వర్ ఐదేళ్ల కుమారుడు కూడా అక్కడే ఉన్నాడు. అతడి కళ్ల ముందే తల్లి చనిపోవడం అందరినీ విషాదంలో ముంచింది. రెస్టారెంట్ యజమాని అప్పటికే సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకుని.. ఈ దుర్మార్గానికి పాల్పడ్డ కస్టమర్ ను అరెస్టు చేశారు. శాండ్ విచ్ లో మేయో ఎక్కువైందంటూ గొడవకు దిగి కాల్పులు జరపడం మతిలేని పని అని వారు పేర్కొన్నారు.