Konda Vishweshwar Reddy: టీఆర్ ఎస్ లో ఉద్యమకారులకు విలువ లేదు.. కాంగ్రెస్ పై విశ్వాసం పోయింది.. బీజేపీలో చేరుతున్నా: కొండా విశ్వేశ్వర్ రెడ్డి
- కార్యకర్తగానే బీజేపీలో చేరుతున్నానన్న విశ్వేశ్వర్ రెడ్డి
- రాష్ట్రంలో కాంగ్రెస్ చచ్చిపోయిందని కామెంట్
- రేవంత్ రెడ్డికి ముందే పీసీసీ ఇచ్చి ఉంటే కాంగ్రెస్ లోనే ఉండేవాడినని వ్యాఖ్య
ప్రముఖ పారిశ్రామిక వేత్త, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరడం ఖాయమైంది. బీజేపీ నేతలతో సుదీర్ఘంగా జరిగిన చర్చల తర్వాత ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు కొండా విశ్వేశ్వర్ రెడ్డి గురువారం ప్రకటించారు. టీఆర్ఎస్ లో ఉద్యమ కారులకు ఏ మాత్రం విలువ లేదని.. కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం పోయిందని.. అందువల్ల బీజేపీలో చేరుతున్నానని ఆయన వెల్లడించారు.
టీఆర్ ఎస్ పాలన దారుణం
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ధనిక రాష్ట్రంగా ఎదుగుతుందని భావించామని.. కానీ టీఆర్ఎస్ పాలనలో పరిస్థితి దారుణంగా తయారైందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. టీఆర్ఎస్ లో ఉద్యమ కారులకు విలువ లేదని.. వారిని పక్కన పెట్టి, తెలంగాణను వ్యతిరేకించిన తలసాని శ్రీనివాస్ యాదవ్, పువ్వాడ అజయ్ వంటి వారిని మంత్రులుగా పెట్టుకున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని.. ప్రస్తుతం టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని స్పష్టం చేశారు.
అలాగైతే కాంగ్రెస్ లో ఉండేవాడిని..
తాను రేవంత్ రెడ్డికి వ్యతిరేకం కాదని.. కానీ కాంగ్రెస్ పూర్తిగా చచ్చిపోయాక రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చారని విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్‌కు సకాలంలో పీసీసీ చీఫ్ పదవిని ఇచ్చి ఉంటే తాను కాంగ్రెస్ లోనే ఉండేవాడినని తెలిపారు. బీజేపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, తాను సాధారణ కార్యకర్తగానే ఆ పార్టీలో చేరుతున్నానని తెలిపారు.