Indian Railways: ఐదేళ్లలో ప్రస్తుత, మాజీ ఎంపీల రైలు ప్రయాణ ఖర్చులు రూ. 62 కోట్లు!
- సమాచారహక్కు చట్టం ద్వారా వెలుగులోకి
- కొవిడ్ ఉద్ధృతంగా ఉన్న సమయంలోనూ ప్రయాణాలు
- ఎడాపెడా పాస్‌లను ఉపయోగించుకున్న వైనం
2017-18 నుంచి 2021-22 మధ్య ప్రస్తుత ఎంపీలు, మాజీ ఎంపీల రైలు ప్రయాణాల కోసం కేంద్ర ప్రభుత్వం ఏకంగా రూ. 62 కోట్లు భరించింది. ఈ మొత్తంలో ప్రస్తుత లోక్‌సభ ఎంపీల ప్రయాణాల ఖర్చు రూ. 35.21 కోట్లు, మాజీ ఎంపీల ఖర్చు రూ. 26.82 కోట్లు ఉన్నాయి. ఈ మేరకు లోక్‌సభ సచివాలయం వెల్లడించింది.
ప్రస్తుత, మాజీ ఎంపీల రైలు ప్రయాణాల కారణంగా ఖజానాపై పడుతున్న భారమెంతో చెప్పాలంటూ మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్ గౌర్ సమాచార హక్కు చట్టం ద్వారా కోరడంతో ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. 2020-21 మధ్య కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉన్న సమయంలోనూ ప్రస్తుత, మాజీ ఎంపీలు వరుసగా రూ. 1.29 కోట్లు, రూ. 1.18 కోట్ల చొప్పున రైల్వే పాసులు వినియోగించుకున్నారు.
సాధారణంగా సిట్టింగ్ ఎంపీలు రైళ్లలో ఫస్ట్ క్లాస్ ఏసీ లేదంటే ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో ఉచితంగా ప్రయాణించవచ్చు. కొన్నిసార్లు వారి భార్యలకు కూడా ఈ వెసులుబాటు ఉంటుంది. మాజీ ఎంపీలు మాత్రం తనకు తోడుగా మరొకరితో కలిసి ఏసీ-2 టైర్లో ఉచితంగా ప్రయాణించొచ్చు. ఒక్కరే అయితే ఫస్ట్ క్లాస్ ఏసీలో ప్రయాణించవచ్చు. ఎంపీలు, మాజీ ఎంపీలకు సంబంధించిన ప్రయాణ బిల్లులను కేంద్ర ప్రభుత్వం రైల్వేకు చెల్లిస్తుంది.