acidity: అసిడిటీని పెంచే ఫుడ్స్.. దూరంగా ఉంటే బెటర్
- ఫ్యాటీ ఆహారానికి దూరంగా ఉండాలి
- మసాలా ఫుడ్స్ తో అసిడిటీ సమస్య
- వెల్లుల్లి వల్ల కూడా ఇది రావచ్చు
- ఆల్కహాల్ తీసుకున్నా సమస్యను ఆహ్వానించినట్టే
కడుపునిండా భోజనం తిన్న తర్వాత ఛాతి దిగువ భాగంలో మంటగా అనిపిస్తే అది అసిడిటీయే. తీసుకున్న ఆహారం, కడుపులోని యాసిడ్స్ తిరిగి అన్న వాహిక (ఈసోఫేగస్) వైపు రావడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. అసిడిటీ రావడానికి కొన్ని కారణాలు అంటూ ఉంటాయి. ముఖ్యంగా కొన్ని రకాల ఆహార పదార్థాల్లో ఉండే ఆమ్ల గుణాలు కూడా ఇందుకు కారణం అవుతాయి.
ఫ్యాటీ ఆహార ఉత్పత్తులు
కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల లోయర్ ఈసోఫాజియల్ స్ఫింక్టర్ (ఎల్ఈఎస్)పై ఒత్తిడి పడుతుంది. కడుపు ఖాళీ అవ్వడానికి ఆలస్యమవుతుంది. ఇది రిఫ్లక్స్ లక్షణాలకు దారితీస్తుంది.
ఆల్కహాల్
ఆల్కహాల్, కెఫీన్, కార్బొనేటెడ్ డ్రింక్స్ అన్నవి అన్న వాహిక వైపు యాసిడ్స్ లీక్ అయ్యేందుకు కారణమవుతాయి. దీనివల్ల ఉదర భాగం పెద్దగా మారొచ్చు. కనుక ఆల్కహాల్ తో పాటు, టీ, కాఫీలను కూడా అసిడిటీతో బాధపడేవారు తగ్గించుకోవాలి.
మసాలా పదార్థాలు
మసాలాలు ఎక్కువగా ఉన్న పదార్థాలకు దూరంగా ఉండాలి. ఇవి కడుపు నొప్పి, మంటకు కారణమవుతాయి. మసాలాల్లో ఉండే క్యాప్సాయిసిన్ ఆహార పదార్థాలను రుచిగా మారుస్తుంది. కానీ, ఇదే అన్న వాహికకు చిరాకు కలిగించొచ్చు. ఇదే యాసిడ్ రిఫ్లక్స్ గా మారుతుంది.
వెల్లుల్లి
వెల్లుల్లి రెబ్బలు తింటే మంచిదని వినే ఉంటాం. ఇందులో ఔషధ గుణాలు ఉన్నాయనేది నిజం. అయితే, పచ్చి వెల్లుల్లి రెబ్బలను తినడం వల్ల కడుపులో మంట వస్తుంది. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సమస్యతో బాధపడుతున్న వారు వెల్లుల్లికి దూరంగా ఉండాలన్నది సూచన. వెల్లుల్లిలోని రసాయనాలు యాసిడ్ ఉత్పత్తి పెరిగేందుకు కారణం అవుతాయి. గుండె మంటకు దారితీస్తాయి.
చాక్లెట్
చాక్లెట్లను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. కానీ, ఇది కూడా గుండె మంటను కలిగిస్తుంది. వీటిల్లో కెఫైన్ ఉంటుందన్న విషయం తెలిసిందే. దీనితోపాటు చాక్లెట్ల తయారీలో వినియోగించే కోకోవా, ప్లాంట్ కెమికల్స్ ఇవన్నీ కూడా మంట కలిగేలా చేస్తాయి.
పండ్లు, కూరగాయలు
ఆహారంలో భాగంగా తీసుకునే కొన్ని రకాల కూరగాయలతో ఈ సమస్య రావచ్చు. అందులో పైనాపిల్, టమాటాలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, సిట్రస్ పండ్లు (నిమ్మ, కమలా తదితర) కడుపులో మంటను కలిగిస్తాయి. వీటిని తిన్నప్పుడు కడుపులో మంట, అసౌకర్యం అనిపిస్తే మరోసారి వీటిని తీసుకోకుండా ఉండడమే పరిష్కారం.