Reliance: ఎగుమతి పన్ను విధించిన కేంద్రం... 5 శాతానికి పైగా న‌ష్ట‌పోయిన రిల‌య‌న్స్ షేరు విలువ‌

reliance share collapses due to union government imposes export tax on petrol and deisel

  • ఉక్రెయిన్‌తో యుద్ధం నేప‌థ్యంలో భార‌త్‌కు రాయితీపై ర‌ష్యా చ‌మురు
  • ఆ చ‌మురును శుద్ధి చేసి సాధార‌ణ రేట్ల‌కే ఎగుమ‌తి చేస్తున్న సంస్థ‌లు
  • ఈ త‌రహా లాభాల‌న్నీ అయాచిత‌మేన‌ని తేల్చిన కేంద్రం
  • ఎగుమ‌తి ప‌న్నుతో పాటు విండ్ ఫాల్ ట్యాక్స్ విధింపు
  • ఎగుమతి చేసే లీట‌ర్ పెట్రోల్‌పై రూ.6, డీజిల్‌పై రూ.13 ప‌న్ను విధింపు

పెట్రోల్, డీజిల్ ఎగుమ‌తుల‌పై ప‌న్ను విధిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం ఫ‌లితంగా రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ షేరు విలువ వేగంగా ప‌త‌న‌మైపోయింది. శుక్ర‌వారం ఒక్క‌రోజే ఆ సంస్థ షేరు విలువ 5.75 శాతం మేర త‌గ్గిపోయింది. రిల‌య‌న్స్‌తో పాటు ప్ర‌భుత్వ రంగంలోని ఓఎన్జీసీ సంస్థ షేరు విలువ కూడా భారీగానే ప‌త‌న‌మైంది. ఈ సంస్థ షేరు విలువ ఓ ద‌శ‌లో 10 శాతం మేర న‌ష్టపోయినా... ఆ త‌ర్వాత కాస్తంత కోలుకుంది.

ఉక్రెయిన్‌పై ర‌ష్యా యుద్ధం నేప‌థ్యంలో భార‌త్‌కు రాయితీపై చ‌మురును ర‌ష్యా అందిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ చమురును శుద్ధి చేస్తున్న సంస్థ‌లు గ‌తంలో ఉన్న సాధార‌ణ రేట్ల‌కే పెట్రోల్‌, డీజిల్‌, విమాన ఇంధ‌నాల‌ను ఎగుమ‌తి చేస్తూ భారీ లాభాల‌ను ఆర్జిస్తున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన కేంద్ర ప్ర‌భుత్వం ఆయా సంస్థ‌లు అయాచితంగా ల‌బ్ధి పొందుతున్నాయ‌న్న అభిప్రాయానికి వ‌చ్చింది. ఈ క్ర‌మంలో ఈ త‌ర‌హా లాభాల‌పై విధించే విండ్ ఫాల్ ట్యాక్స్‌తో పాటు ఎగుమ‌తి ప‌న్నును విధిస్తూ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 

కేంద్రం తీసుకున్న ఈ నిర్ణ‌యంతో దేశం నుంచి విదేశాల‌కు ఎగుమ‌తి అయ్యే పెట్రోల్‌, విమాన ఇంధ‌నం లీట‌రు ఒక్కింటికి రూ.6, డీజిల్‌పై రూ.16 ప‌న్నును ఆయా సంస్థ‌లు క‌ట్టాల్సి ఉంది. అదే స‌మ‌యంలో దేశీయంగా ఉత్ప‌త్తి అయ్యే ట‌న్ను ముడి చ‌మురుపై ఆయా సంస్థ‌లు రూ.23,250 చెల్లించాల్సి ఉంది. ఇప్ప‌టిదాకా ఈ ప‌న్నులేమీ లేక‌పోవ‌డంతో రిల‌య‌న్స్ స‌హా వేదాంత, కెయిర్న్‌ త‌దిత‌ర ప్రైవేట్ కంపెనీల‌తో పాటు ఓఎన్జీసీ వంటి ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు కూడా భారీ లాభాల‌ను ఆర్జించాయి. అయితే తాజాగా ఎగుమ‌తి ప‌న్నుతో ఆయా సంస్థ‌ల షేర్ల విలువ‌లు భారీగా ప‌త‌న‌మ‌వుతున్నాయి.

  • Loading...

More Telugu News