North Korea: ఆ దేశ బెలూన్ల వల్లే మా దగ్గర కరోనా.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్
- దక్షిణ కొరియాపై ఆరోపణలు గుప్పించిన కిమ్
- సరిహద్దుల వెంట గుర్తు తెలియని వస్తువులతో వైరస్
- వాటిని ముట్టుకున్న ప్రజలకు కోవిడ్ సోకిందని వెల్లడి
- దీనివల్లే ఉత్తర కొరియాలో కరోనా వ్యాప్తి చెందిందని ప్రకటన
సరిహద్దుల వెంట దక్షిణ కొరియా వైపు నుంచి వచ్చిన బెలూన్లు, ఇతర వస్తువుల కారణంగానే తమ దేశంలోకి కరోనా వైరస్ ప్రవేశించిందని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోపించారు. ఈ మేరకు తమ దేశంలో కోవిడ్ వ్యాప్తికి విదేశీ వస్తువులే మూలం అయ్యాయని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. ఉత్తర కొరియా ప్రజలు సరిహద్దుల వెంబడి బెలూన్ల ద్వారా పంపే విదేశీ వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
దశాబ్దాల శత్రుత్వం మధ్య
చాలా ఏళ్లుగా ఉత్తర కొరియా, దక్షిణ కొరియా దేశాల మధ్య తీవ్ర స్థాయిలో శత్రుత్వం ఉంది. రెండు దేశాల మధ్య రాకపోకలు కూడా బాగా తక్కువ. సరిహద్దుల వెంట కంచె ఉంటుంది. అయితే రెండు దేశాలకు చెందిన ప్రజలు సరిహద్దుల వెంట కాస్త పెద్ద బెలూన్లతో కర పత్రాలు, ఇతర సామగ్రిని పంపుకొంటుంటారు. తీవ్ర పేదరికంతో అల్లాడే ఉత్తర కొరియాకు దక్షిణ కొరియా ప్రజల నుంచి బెలూన్ల ద్వారానే సాయం కూడా అందుతుంటుంది. ఉత్తర కొరియా నుంచి ఏదైనా సమాచారం అందించేవారు ఇలా బెలూన్ల ద్వారానే ఇస్తుంటారు. అయితే ఇంతకు ముందు దక్షిణ కొరియా కొంతకాలం ఈ విధానాన్ని నిషేధించింది. ఇటీవల కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో తిరిగి బెలూన్ల ఎగరవేత కొనసాగుతోంది. దీనిని ఆసరాగా తీసుకునే దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా ఆరోపణలు చేసింది.
బెలూన్ ద్వారా ఓ సైనికుడు, చిన్నారికి కరోనా..
ఉత్తర కొరియా ఆగ్నేయ ప్రాంతంలో సరిహద్దుల వెంట దక్షిణ కొరియా నుంచి వచ్చిన బెలూన్, వస్తువులను తాకడం వల్ల కరోనా వ్యాప్తి మొదలైందని ఉత్తర కొరియా పేర్కొంది. మొదట ఒక సైనికుడు, ఓ చిన్నారికి కరోనా లక్షణాలు కనిపించాయని.. కానీ అప్పటికే రాకపోకల వల్ల దేశంలో వైరస్ వ్యాపించిందని ఆరోపించింది.