Railway Stations: ఆగస్ట్ 1 నుంచి రైల్వే స్టేషన్లలో అమల్లోకి రానున్న కొత్త నిబంధన
- ప్లాట్ ఫామ్ లపై అన్ని అమ్మకాలకు క్యాష్ లెస్ చెల్లింపులు మాత్రమే
- విక్రేతలు నగదు తీసుకోవడానికి వీలుండదు
- ప్రతి వస్తువు ఎమ్మార్పీ ధరకు అమ్మాల్సిందే
రైల్వే శాఖ సరికొత్త నిబంధనను తీసుకొస్తోంది. దేశంలో ఉన్న అన్ని రైల్వే స్టేషన్లలో క్యాటరింగ్ ను క్యాష్ లెస్ చెల్లింపుల ద్వారా చేయాలని భారత రైల్వే బోర్డు నిర్ణయించింది. ఆగస్ట్ 1వ తేదీ నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది.
తాజా నిర్ణయంతో రైల్వే స్టేషన్లలో క్యాటరింగ్ తో పాటు అన్ని స్టాల్స్ లో నగదు స్వీకరించేందుకు వీలుండదు. అన్నింటినీ డిజిటల్ పద్ధతిలో విక్రయిస్తారు. నిబంధనను అతిక్రమించే వారికి రూ. 10 వేల నుంచి రూ. లక్ష వరకు జరిమానా విధించనున్నారు.
డిజిటల్ చెల్లింపుల కోసం యూపీఐ, స్వైపింగ్ మెషీన్లను కలిగి ఉండాలని రైల్వే బోర్డు ఆదేశించింది. అంతేకాదు, ప్రతి విక్రయానికి కంప్యూటరైజ్డ్ బిల్లు ఇవ్వాలని చెప్పింది. రైల్వే బోర్డు నిర్ణయంతో ప్లాట్ ఫామ్ పై ప్రతి వస్తువును చచ్చినట్టు ఎమ్మార్పీ ధరకే అమ్మాల్సి ఉంటుంది. ఇకపై ఎక్కువ ధరకు అమ్మలేరు.