Narendra Modi: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ప్రధాని మోదీ ఫోన్
- భారత్ కు చిరకాల మిత్రదేశంగా రష్యా
- ద్వైపాక్షిక సంబంధాలపై మాట్లాడుకున్న మోదీ, పుతిన్
- ఉక్రెయిన్ సంక్షోభంపైనా చర్చ
- తన పాత వైఖరికే కట్టుబడిన భారత్
మిత్రదేశం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో ప్రధాని నరేంద్ర మోదీ టెలిఫోన్ లో సంభాషించారు. పుతిన్ భారత్ లో పర్యటించిన సందర్భంగా కుదుర్చుకున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు, నిర్ణయాల అమలుపై ఇరువురు నేతలు సమీక్షించారు. ఇంధనం, ఆహార విపణి తదితర ప్రపంచ అంశాలపైనా ఫోన్ లో చర్చించారు. ముఖ్యంగా, వ్యవసాయ ఉత్పత్తులు, ఎరువులు, ఫార్మా ఉత్పాదనల పరస్పర వాణిజ్యంపై సమాలోచనలు చేశారు.
ఇద్దరి మధ్య సంభాషణలో ఉక్రెయిన్ సంక్షోభం కూడా ప్రస్తావనకు వచ్చింది. అయితే, చర్చల ద్వారానే ఈ సమస్యను పరిష్కరించుకోవాలన్న భారత్ వైఖరిని ఈ సందర్భంగా మోదీ పునరుద్ఘాటించారు. ద్వైపాక్షిక, ప్రపంచ అంశాలపై ఇరుదేశాలు క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతుండాలని మోదీ, పుతిన్ నిర్ణయించారు.