Unmanned Aerial Vehicle: తొలిసారి మానవ రహిత యుద్ధ విమానాన్ని పరీక్షించిన భారత్
- కర్ణాటకలో చిత్రదుర్గ ఏరోనాటికల్ రేంజ్ లో పరీక్ష
- విజయవంతంగా గగనవిహారం చేసిన విమానం
- సాఫీగా టేకాఫ్, ల్యాండింగ్.. డీఆర్డీవో వర్గాల్లో హర్షం
- అభినందించిన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్
భారత రక్షణ రంగంలో మరో కీలక ముందడుగు పడింది. దేశ ఆయుధ పాటవాన్ని మరింత ఇనుమడింపజేస్తున్న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) మరో అద్భుత అస్త్రాన్ని సిద్ధం చేస్తోంది. డీఆర్డీవో తొలిసారిగా మానవ రహిత యుద్ధ విమానాన్ని పరీక్షించింది. కర్ణాటకలోని చిత్రదుర్గ ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ లో ఈ పరీక్ష చేపట్టారు. అమితవేగంతో దూసుకుపోయిన ఈ విమానం డీఆర్డీవో పరిశోధకుల్లో ఆనందోత్సాహాలు నింపింది. మానవ రహిత యుద్ధ విమానం అభివృద్ధిలో ఇది ఘనవిజయం అని డీఆర్డీవో వర్గాలు వెల్లడించాయి.
కాగా, ఈ మానవ రహిత యుద్ధ విమానానికి అటానమస్ ఫ్లయింగ్ వింగ్ టెక్నాలజీ డెమాన్ స్ట్రేటర్ గా నామకరణం చేశారు. మొట్టమొదటిసారిగా ఇవాళ నిర్వహించిన పరీక్షలో ఇది సాఫీగా టేకాఫ్ తీసుకుని గగనవిహారం చేయడమే కాకుండా, ఎలాంటి లోపాలు లేకుండా తిరిగి ల్యాండైంది. దీనిపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. అపూర్వమైన ఘనత సాధించారంటూ డీఆర్డీవో శాస్త్రవేత్తలను అభినందించారు. క్లిష్టమైన సైనిక వ్యవస్థల రూపకల్పన దిశగా 'ఆత్మనిర్భర్ భారత్' కు మార్గదర్శనం చేశారని కొనియాడారు.