Ayyanna Patrudu: అయ్యన్న వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించొద్దు... ఏపీ పోలీసులకు హైకోర్టు ఆదేశం
- ఇటీవలే అయ్యన్న ఇంటి ప్రహరీని కూల్చేసిన అధికారులు
- అయ్యన్న ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు
- తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారంటూ అయ్యన్న పిటిషన్
- కేసులు లేకున్నా అయ్యన్న ఇంటి వద్ద బలగాల మోహరింపును తప్పుబట్టిన కోర్టు
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించరాదని ఏపీ పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అయ్యన్న దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన హైకోర్టు... అకారణంగా పెద్ద సంఖ్యలో పోలీసులను అయ్యన్న ఇంటి వద్ద ఎందుకు మోహరిస్తున్నారని ప్రశ్నించింది. అయ్యన్నపై కేసులు లేకున్నా బలగాల మోహరింపు ఎందుకని కూడా కోర్టు పోలీసులను నిలదీసింది.
తన వ్యక్తిగత స్వేచ్ఛకు ఏపీ పోలీసులు భంగం కలిగిస్తున్నారంటూ అయ్యన్నపాత్రుడు ఇటీవలే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టింది. పంట కాల్వను ఆక్రమించి ఇల్లు కట్టారని ఆరోపిస్తూ ఇటీవలే నర్సీపట్నంలో మునిసిపల్ అధికారులు అయ్యన్న ఇంటి ప్రహరీని కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అయ్యన్న ఇంటి వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఈ వ్యవహారంపైనే అయ్యన్న హైకోర్టును ఆశ్రయించారు.