Pakistan: అమెరికా, సౌదీ అరేబియా తదితర దేశాలకు డంపింగ్ యార్డుగా పాకిస్థాన్
- పాక్ లో పేరుకుపోతున్న వ్యర్థాలు
- ఏటా 30 మిలియన్ టన్నుల వ్యర్థాల ఉత్పత్తి
- విదేశాల నుంచి 80 వేల టన్నుల వ్యర్థాల దిగుమతి
- పాక్ లో ప్రబలుతున్న పర్యావరణ, ఆరోగ్య సమస్యలు
పలు సంపన్న దేశాలకు పాకిస్థాన్ చెత్తకుండీగా మారుతోందా?... ఈ ప్రశ్నకు పాకిస్థాన్ ప్రభుత్వ జవాబు ఏంటో చూడండి. దేశంలో ఏటా 30 మిలియన్ టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని, అదే సమయంలో 80 వేల టన్నుల వ్యర్థాలు ప్రపంచదేశాల నుంచి వచ్చిపడుతున్నాయని పార్లమెంటు స్టాండింగ్ కమిటీ వెల్లడించింది.
దీని వల్ల పర్యావరణ, ఆరోగ్య సంబంధ సమస్యలు తీవ్రమవుతున్నాయని వివరించింది. అమెరికా, సౌదీ అరేబియా, కెనడా, యూకే, జర్మనీ, ఇటలీ వంటి దేశాల నుంచి పాకిస్థాన్ కు భారీఎత్తున వ్యర్థాలను తరలిస్తున్నారని పేర్కొంది. పర్యావరణ మార్పులపై ఎలుగెత్తే కొన్ని మిత్రదేశాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయని వివరించింది.
"విదేశాల నుంచి వ్యర్థాల దిగుమతి పట్ల పాకిస్థాన్ ఎన్నడూ ఎందుకు అభ్యంతరం పెట్టదు? దౌత్య కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, సంబంధిత శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, సమాఖ్య ప్రభుత్వం ఎందుకు దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించవు?" అంటూ ఓ చట్టసభ సభ్యుడు ఆక్రోశించారు.
కాగా, విదేశాల నుంచి తమ దేశానికి ఇంత చెత్త వచ్చిపడుతోందన్న విషయమే తమకు తెలియదని చాలామంది చట్టసభ సభ్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందిన దేశాలకు పాకిస్థాన్ ఓ డంపింగ్ యార్డుగా మారిందన్న వాస్తవం పట్ల విచారం వ్యక్తం చేశారు. వారిలో కొందరు... పాకిస్థాన్ నగరాల వీధుల్లో ఎక్కడ చూసినా విషపూరిత వ్యర్థాలు, ఇతర చెత్తతో నిండిపోయి ఉన్నాయని, పాకిస్థాన్ ఎందుకు వ్యర్థాలను ఎగుమతి చేయదు? అంటూ ప్రశ్నించారు.