Brahmotsavams: సెప్టెంబరు 27 నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
- గత రెండేళ్ల పాటు ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు
- సాధారణ స్థితికి కరోనా వ్యాప్తి
- ఈసారి భక్తుల సమక్షంలో స్వామివారి సేవలు
- సమీక్ష నిర్వహించిన ఏవో ధర్మారెడ్డి
కరోనా వ్యాప్తి కారణంగా రెండేళ్ల పాటు భక్తులు లేకుండానే తిరుమల శ్రీవారికి బ్రహ్మోత్సవాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే, మునుపటితో పోల్చితే కరోనా పరిస్థితులు సద్దుమణగడంతో ఈసారి భక్త జనసందోహం నడుమ స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. కాగా, శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 27 నుంచి జరగనున్నాయి. ఈ ఉత్సవాలు అక్టోబరు 5న ముగుస్తాయి. దీనిపై టీటీడీ ఏవో ధర్మారెడ్డి వివరాలు తెలిపారు.
తిరుమాడ వీధుల్లో వెంకటేశ్వరుడి వాహన సేవలు నిర్వహిస్తామని, తద్వారా భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామని వివరించారు. సెప్టెంబరు 27వ తేదీ సాయంత్రం మీన లగ్నంలో 5.45-6.15 గంటల మధ్య ధ్వజారోహణం జరగనుందని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని ధర్మారెడ్డి వెల్లడించారు.
కాగా, అక్టోబరు 1న గరుడ సేవ, అక్టోబరు 2న స్వర్ణ రథ సేవ, అక్టోబరు 4న రథోత్సవం జరుగుతాయని, అక్టోబరు 5న చక్రస్నానంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఏవో ధర్మారెడ్డి వివరించారు. కాగా, ఈసారి భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో పసిబిడ్డల తల్లిదండ్రులు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శనాలు ఉండవని వెల్లడించారు.
తిరుమలలో పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ పై నిషేధం ఉండడంతో భక్తులు రాగి, గాజు, స్టీల్ వాటర్ బాటిళ్లు తెచ్చుకోవాల్సి ఉంటుందని ఏవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు.