TPCC President: యశ్వంత్ సిన్హా పర్యటనతో టీ కాంగ్రెస్లో మరోసారి బయటపడ్డ విబేధాలు
- యశ్వంత్ సిన్హా ని కలిసేది లేదని ప్రకటించిన పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి
- టీఆర్ఎస్ ఉండటంతో పర్యటనకు దూరంగా ఉండాలని నిర్ణయం
- రేవంత్, సీఎల్పీ నేత భట్టిని తప్పు పడుతూ జగ్గారెడ్డి లేఖ
- యశ్వంత్ కు ఎయిర్ పోర్టులో స్వాగతం పలికిన వీహెచ్
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ తెలంగాణ పార్టీలో అంతర్గత విబేధాలు మరోసారి బయటపడ్డాయి. యశ్వంత్ పర్యటనను అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సీఎం కేసీఆర్ విమానాశ్రయానికి వెళ్లి స్వయంగా యశ్వంత్ కు ఘన స్వాగతం పలికారు. జల విహార్ లో పరిచయ సభకు తన కారులోనే తీసుకెళ్లారు.
యశ్వంత్ అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ కూడా మద్దతు ఇస్తోంది. కానీ, టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న యశ్వంత్ హైదరాబాద్ పర్యటనకు దూరంగా ఉండాలని టీపీసీసీ నిర్ణయించుకుంది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. హైదరాబాద్ లో తాము యశ్వంత్ ను కలవబోమని ప్రకటించారు. కానీ, ఆయన ఆదేశాలను ఆ పార్టీ నేతలు లెక్క చేయడం లేదు. ఇప్పటికే సీనియర్ నేత వి. హనుమంతరావు.. ఎయిర్ పోర్టుకు వెళ్లి యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికారు.
మరోవైపు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. యశ్వంత్ ను కలిసేందుకు ఆయన అపాయింట్ మెంట్ కోరారు. సిన్హాకు కాంగ్రెస్ మద్దతిస్తున్నప్పుడు ఆయనను సీఎల్పీకి పిలిస్తే బాగుండేదని అన్నారు. సిన్హాను కలవొద్దని ప్రకటించిన రేవంత్, సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్కను తప్పుపడుతూ జగ్గారెడ్డి లేఖ రాయడం చర్చనీయాంశమైంది. తెలంగాణ కాంగ్రెస్ లో యశ్వంత్ పర్యటన ఏ పరిస్థితికి దారి తీస్తుందో చూడాలి.