NDA: ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రేసులో పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్!
- వైద్య చికిత్స నిమిత్తం విదేశాలకు వెళ్లిన అమరీందర్
- తిరిగి రాగానే తన పార్టీని బీజేపీలో విలీనం చేసే దిశగా కెప్టెన్
- ఇప్పటికే దీనిపై మోదీతో చర్చించిన పంజాబ్ మాజీ సీఎం
- ఆ వెంటనే ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కెప్టెన్ ఎంపిక కానున్నట్లు వార్తలు
భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 5న ఉపరాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండగా.. అదే రోజు నుంచి నామినేషన్ దాఖలుకు తెర లేవనుంది. ఈ నేపథ్యంలో అధికార ఎన్డీఏ కూటమి తన అభ్యర్థి ఎవరన్న దానిపై కసరత్తు మొదలుపెట్టింది. కాంగ్రెస్‌తో విభేదించి ఇటీవలే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పిన పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను తన అభ్యర్థిగా ప్రకటించే దిశగా బీజేపీ సాగుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్‌తో విభేదించి పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరిట కొత్త పార్టీ పెట్టిన అమరీందర్ బీజేపీతో కలిసిపోయారు. అయితే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్‌తో పాటు అటు బీజేపీ, కెప్టెన్ కూటమికి కూడా భారీ షాక్ తగిలింది. ఈ క్రమంలో తన కొత్త పార్టీని బీజేపీలో విలీనం చేసే దిశగా కెప్టెన్ అడుగులు వేస్తున్నారు. ఈ విషయాన్ని అమరీందర్ సింగ్ కార్యాలయమే లీక్ చేసింది. ప్రస్తుతం వైద్య చికిత్స నిమిత్తం విదేశాల్లో ఉన్న కెప్టెన్‌తో ఇప్పటికే మోదీ చర్చించినట్లు సమాచారం.
తన కొత్త పార్టీని బీజేపీలో విలీనం చేస్తే... అమరీందర్‌ను ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసేందుకు ప్రధాని సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇదే విషయంపై అమరీందర్, మోదీలు ఇప్పటికే చర్చించారని, కెప్టెన్ దేశానికి తిరిగి వచ్చిన వెంటనే బీజేపీతో ఆయన పార్టీ విలీనం జరిగిపోతుందని, ఆ వెంటనే ఆయనను ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.