Hyderabad: హౌసింగ్ రంగంలో ముంబయి తర్వాత ఖరీదైన నగరం హైదరాబాదే!
- ఈఎంఐ, నెలవారీ ఆదాయం నిష్పత్తి సగటే ప్రాతిపదిక
- 2022 ప్రథమార్థంలో పరిస్థితులపై నివేదిక
- జాబితా రూపొందించిన నైట్ ఫ్రాంక్ కన్సల్టెన్సీ
- గృహ కొనుగోలుకు అనువైన నగరంగా అహ్మదాబాద్
అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ భారత్ లో గృహ విపణి రంగంలో అత్యంత ఖరీదైన 8 నగరాలతో జాబితా రూపొందించింది. 2022 ప్రథమార్థంలో భారత్ లోని పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటూ ఈ జాబితా విడుదల చేసింది. ఈ మేరకు హౌసింగ్ రంగంలో హైదరాబాద్ నగరానికి రెండోస్థానం లభించింది. ఈ జాబితాలో ముంబయి మహానగరం ప్రథమస్థానంలో ఉంది.
ఈఎంఐ, నెలవారీ ఆదాయం నిష్పత్తి ప్రాతిపదికన ఖరీదైన నగరాలను ఎంపిక చేశారు. గృహ విపణి రంగంలో ఆ నిష్పత్తి సగటు ముంబయిలో 2021లో 53 శాతం ఉండగా, 2022 నాటికి 56 శాతానికి పెరిగింది. రెండో ఖరీదైన నగరంగా ఉన్న హైదరాబాదులో ఆ నిష్పత్తి 2021లో 29 శాతం ఉండగా, 2022 ప్రథమార్థం నాటికి అది 31 శాతం అయింది. ఇక, మూడోస్థానంలో దేశ రాజధాని ప్రాంతం (ఢిల్లీ) నిలిచింది. ఢిల్లీలో ఈఎఐం, నెలవారీ ఆదాయ నిష్పత్తి 2022లో 28 శాతంగా ఉంది.
హైదరాబాదు విషయానికొస్తే... ప్రజల గృహ కొనుగోలు సామర్థ్యం 2010లో 47 శాతం ఉండగా, 2019 నాటికి అది 33 శాతంగా నమోదైంది. ఆ తర్వాత కరోనా విజృంభించగా, 2020లో ఈ నిష్పత్తి 31 శాతానికి చేరింది. బ్యాంకులు హౌసింగ్ లోన్లపై వడ్డీ రేట్లు పెంచడం కూడా ప్రజల కొనుగోలు సామర్థ్యం తగ్గడానికి ప్రధాన కారణమని నైట్ ఫ్రాంక్ సంస్థ అభిప్రాయపడింది.
ఇక, ముంబయి, హైదరాబాద్, ఢిల్లీ తర్వాత బెంగళూరు (28%), కోల్ కతా (27%),పుణే (26%), చెన్నై (26%), అహ్మదాబాద్ (22%) నగరాలు ఉన్నాయి. ఈఎంఐ, నెలవారీ ఆదాయ నిష్పత్తి సగటు అతి తక్కువగా ఉన్న అహ్మదాబాద్ నగరంలో ప్రజల గృహ కొనుగోలు స్థోమత అధికమైనట్టు నైట్ ఫ్రాంక్ నివేదిక చెబుతోంది.