Pharmacist: మహారాష్ట్రలో ఫార్మసిస్టు హత్య... నుపుర్ కు మద్దతు పలకడంతో చంపి ఉంటారని అనుమానం... ఎన్ఐఏ దర్యాప్తుకు కేంద్రం ఆదేశం
- జూన్ 21న ఫార్మసిస్టు హత్య
- ఆరుగురి అరెస్ట్
- కేసును ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యల ఫలితంగా దేశంలో పలు దారుణ ఘటనలు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో కన్హయ్యలాల్ అనే టైలర్ ను అత్యంత కిరాతకంగా చంపేశారు. నుపుర్ శర్మకు మద్దతు పలికాడన్న కారణంతో అతడిని చంపేశారు. కాగా, జూన్ 21న మహారాష్ట్రలోని అమరావతిలో ఉమేశ్ కోల్హే అనే ఫార్మసిస్టును హత్య చేయగా, ఇది కూడా నుపుర్ శర్మకు మద్దతు పలికాడన్న కారణంతోనే చేసి ఉంటారని ఇప్పుడు అనుమానాలు కలుగుతున్నాయి. దీనిపై కేంద్రం స్పందించింది.
ఫార్మసిస్టు హత్య కేసును దర్యాప్తు చేయాలంటూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఎన్ఐఏని ఆదేశించింది. ఈ కేసును ఇకపై ఎన్ఐఏ విచారిస్తుందని కేంద్ర హోంశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ హత్య కేసులో ఏవైనా సంస్థలు ఉన్నాయా, వాటికున్న అంతర్జాతీయ సంబంధాలను ఎన్ఐఏ క్షుణ్నంగా విచారిస్తుందని పేర్కొంది.
అమరావతిలో జరిగిన ఈ హత్య కేసుకు సంబంధించి స్థానిక పోలీసులు ఇప్పటిదాకా ఆరుగురిని అరెస్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజి ఆధారంగా వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని ముదస్సిర్ అహ్మద్, షారుఖ్ పఠాన్, అబ్దుల్ తౌఫీక్, షోయబ్ ఖాన్, ఆతిబ్ రషీద్, యూసుఫ్ ఖాన్ బహదూర్ గా గుర్తించారు. కాగా, మరో అనుమానితుడు షామిన్ అహ్మద్ తప్పించుకున్నట్టు తెలుస్తోంది.