Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సేవలు నేడు యథాతథం.. ఆ వార్తలు ఫేక్ అంటూ కొట్టిపడేసిన అధికారులు
- ప్రధానమంత్రి భద్రత నేపథ్యంలో రెండు రోజులపాటు మెట్రో సేవలు బంద్ అంటూ వార్తలు
- రైళ్లు యథాతథంగా నడుస్తాయన్న హైదరాబాద్ మెట్రో
- బీజేపీ సభకు వెళ్లేందుకు కార్యకర్తలు కూడా మెట్రోనే ఆశ్రయించే అవకాశం
హైదరాబాద్‌లో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ భద్రత నేపథ్యంలో రెండు రోజులపాటు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉండవన్న ప్రచారంపై హైదరాబాద్ మెట్రో స్పందించింది. అది తప్పుడు ప్రచారమని, నిజం లేదని స్పష్టం చేసింది. నేడు యథాతథంగా రైళ్లు నడుస్తాయని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. నేటి సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ విజయ్ సంకల్ప్ సభ జరగనుంది. దీంతో మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ఈ నేపథ్యంలో ప్రయాణికులకు మెట్రో ప్రత్యామ్నాయంగా మారనుంది. సభ జరిగే పరేడ్ గ్రౌండ్ సమీపంలోనే పరేడ్ గ్రౌండ్, జేబీఎస్ మెట్రో స్టేషన్లు ఉండడంతో సభకు హాజరు కావాలనుకునే బీజేపీ కార్యకర్తలు కూడా మెట్రోను ఆశ్రయించే అవకాశం ఉంది. దీనికి తోడు ఆదివారం హాలిడే పాస్ రూ. 59కే అందుబాటులో ఉండడం కూడా కలిసి వచ్చే అంశం. కాబట్టి ఎక్కువ మంది మెట్రోనే ఆశ్రయించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.