YSRCP: పారిస్ నుంచి తిరిగి వచ్చిన జగన్... గ్రాండ్ వెల్‌కమ్ చెప్పిన మంత్రి జోగి రమేశ్
- కూతురు కళాశాల స్నాతకోత్సవం కోసం పారిస్ వెళ్లిన జగన్
- శనివారం ముగిసిన కళాశాల స్నాతకోత్సవం
- ఆ వెంటనే శనివారం రాత్రే తిరుగు ప్రయాణమైన జగన్
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పారిస్ పర్యటన ముగిసింది. పారిస్ నుంచి శనివారం రాత్రి బయలుదేరిన జగన్ ఆదివారం ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి జోగి రమేశ్ ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా తదితరులు కూడా జగన్‌కు స్వాగతం పలికారు.
తన కూతురు హర్షిణి రెడ్డి మాస్టర్స్ పూర్తి చేసుకున్న తరుణంలో పారిస్‌లోని ఇన్‌సీడ్ వర్సిటీ స్నాతకోత్సవంలో పాలుపంచుకునే నిమిత్తం సతీసమేతంగా జగన్ పారిస్ వెళ్లిన సంగతి తెలిసిందే. శనివారం హర్షిణి రెడ్డి వర్సిటీ నుంచి మాస్టర్స్ పట్టాను తీసుకున్నారు. విద్యాభ్యాసంలో సత్తా చాటుతూ ఆమె మాస్టర్స్‌ను డిస్టింక్షన్‌లో పాసయ్యారు. ఈ కార్యక్రమం పూర్తి అయిన వెంటనే తిరుగు ప్రయాణమైన జగన్ ఆదివారం ఉదయానికల్లా విజయవాడ చేరుకున్నారు.