Team India: నేను పొరపాటున భారత్ కోచ్ అయ్యా.. అందుకు ద్రవిడే సరైనోడు: రవిశాస్త్రి
- కామెంటరీ బాక్సులో ఉన్న తనకు కోచింగ్ అప్పగించారని వ్యాఖ్య
- తన తర్వాత హెడ్ కోచ్ పగ్గాలు అందుకునేందుకు ద్రవిడ్ సరైన వ్యక్తి అన్న శాస్త్రి
- అతని మార్గనిర్దేశంలో జట్టు ఉన్నత శిఖరాలు అధిరోహిస్తుందని విశ్వాసం
భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను పొరపాటున టీమ్ ఇండియా కోచ్ అయ్యానని అన్నాడు. కామెంటరీ బాక్సులో ఉన్న తనకు కోచింగ్ బాధ్యతలు అప్పగించారని చెప్పాడు. అయితే, ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్ అలా కాదన్నాడు. తను వ్యవస్థలో నుంచి వచ్చి కోచ్ అయ్యాడని తెలిపాడు. ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్న ద్రవిడ్ మార్గనిర్దేశంలో భారత జట్టు అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తుందని అభిప్రాయపడ్డాడు.
‘నా తర్వాత భారత జట్టు కోచింగ్ బాధ్యతలు చేపట్టేందుకు రాహుల్‌ను మించిన వ్యక్తి లేడు. నాకు పొరపాటున ఈ పదవి వచ్చింది. కామెంటరీ బాక్సులో ఉన్న నన్ను అక్కడికి (కోచింగ్) వెళ్లమని అడిగారు. నేను నా వంతు కృషి చేసాను. కానీ రాహుల్ వ్యవస్థ ద్వారా వచ్చిన వ్యక్తి. ఎంతో కష్టపడి ముందుకొచ్చాడు. చాన్నాళ్లు అండర్ 19 జట్టు కోచ్‌గా పని చేసి ఇప్పుడు జాతీయ జట్టు బాధ్యతలు అందుకున్నాడు. తను చెప్పినట్టు జట్టు చేస్తే ఈ పదవిని ద్రవిడ్ చాలా ఆస్వాదిస్తూ పని చేస్తాడు.
కాగా, శాస్త్రి హయాంలో, టెస్ట్ ఫార్మాట్లో దక్షిణాఫ్రికా మినహా మిగిలిన అన్ని పెద్ద దేశాల్లో టెస్టు సిరీస్ లు గెలిచింది. ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యాటక జట్టుగా అవతరించింది. రవిశాస్త్రి కోచ్ గా ఉన్న సమయంలో భారత్ ప్రపంచ కప్‌లు గెలవనప్పటికీ, జట్టుపై శాస్త్రి తనదైన ముద్ర వేశాడు. కెప్టెన్ కోహ్లీతో కలిసి జట్టు నిర్భయమైన ఆట ఆడేలా చేశాడు.