Rahul Narwekar: స్పీకర్ ఎన్నికకూ ఓటింగ్.. 164 ఓట్లతో నెగ్గిన బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ నర్వేకర్
- బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న రాహుల్ నర్వేకర్
- ఎన్సీపీ ఎమ్మెల్యే రాజన్ సాల్విని బరిలోకి దింపిన ఉద్ధవ్ వర్గం
- రాజన్‌కు మద్దతుగా నిలిచిన శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ
- ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయిన మజ్లిస్ ఎమ్మెల్యేలు
- 107 ఓట్లే రావడంతో ఓటింగ్‌లో వెనుకబడిన రాజన్
మహారాష్ట్ర రాజకీయాల్లో ఆదివారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ నర్వేకర్ ఎన్నికయ్యారు. సాధారణంగా అసెంబ్లీ స్పీకర్‌గా అధికార పక్షానికి చెందిన ఎమ్మెల్యేనే ఎన్నికవుతున్న సంగతి తెలిసిందే. అధికార కూటమి ప్రతిపాదించిన స్పీకర్ అభ్యర్థిని విపక్షం అంతగా వ్యతిరేకించదు కూడా. ఎందుకంటే... అధికార పక్షం అంటేనే సభలో మెజారిటీ కలిగిన పక్షం కాబట్టి. అయితే మహారాష్ట్ర అసెంబ్లీలో మాత్రం స్పీకర్ ఎన్నికపై ఓటింగ్ జరిగింది.
మహారాష్ట్రలో కొత్తగా కొలువుదీరిన ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం సోమవారం తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. ఇది జరగాలంటే ముందుగా స్పీకర్ ఎన్నిక జరగాలి. ఈ క్రమంలో ఆదివారం స్పీకర్ ఎన్నిక కోసం మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కాగా... అధికార కూటమి తన అభ్యర్థిగా బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ నర్వేకర్‌ను ప్రతిపాదించింది. ఈ ఎంపికను వైరి వర్గం శివసేన కూటమి వ్యతిరేకించింది. తమ అభ్యర్థిగా రాజన్ సాల్విని ప్రతిపాదించింది. ఫలితంగా ఓటింగ్ నిర్వహించక తప్పలేదు.
ఓటింగ్‌లో సీఎం షిండే వెంట నిలిచిన శివసేన రెబల్ ఎమ్మెల్యేలతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు, కొందరు ఇండిపెండెంట్లు రాహుల్ అభ్యర్థిత్వానికి మద్దతుగా నిలిచారు. ఇక మాజీ సీఎం ఉద్ధవ్ థాకరే వెంట నిలిచిన శివసేన ఎమ్మెల్యేలు, కాంగ్రెస్, ఎన్సీపీ ఎమ్మెల్యేలు రాజన్ సాల్వి అభ్యర్థిత్వానికి మద్దతుగా నిలిచారు. ఎంఐఎం ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయింది. ఓటింగ్‌లో రాహుల్‌కు మద్దతుగా 164 ఓట్లు, రాజన్ సాల్వికి 107 ఓట్లు వచ్చాయి. దీంతో మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా రాహుల్ నర్వేకర్ ఎన్నికయ్యారు.