Team India: బర్మింగ్ హామ్ టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ అవుట్... కోహ్లీ, బెయిర్ స్టో మధ్య తీవ్ర వాగ్వాదం... వీడియో ఇదిగో!
- మూడో రోజు ఆటలో స్టోక్స్ అవుట్
- ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
- దూకుడుగా ఆడుతున్న బెయిర్ స్టో
- బర్మింగ్ హామ్ లో ఆసక్తికరంగా టెస్టు
టీమిండియా, ఇంగ్లండ్ మధ్య బర్మింగ్ హామ్ లో జరుగుతున్న టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 416 పరుగులు చేయగా, ఇంగ్లండ్ ఓ దశలో 83 పరుగులకే 5 వికెట్లు కోల్పోగా, బెయిర్ స్టో దూకుడుతో కోలుకుంది. కాగా, మూడో రోజు ఆట తొలి సెషన్ లోనే ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అవుటయ్యాడు. 25 పరుగులు చేసిన స్టోక్స్ ను శార్దూల్ ఠాకూర్ అవుట్ చేశాడు. దాంతో ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది.
అయితే, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ శామ్ బిల్లింగ్స్ తో కలిసి బెయిర్ స్టో స్కోరు బోర్డును పరుగులు తీయించాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోరు 42 ఓవర్లలో 6 వికెట్లకు 178 పరుగులు. బెయిర్ స్టో 93 బంతుల్లో 72 పరుగులు చేశాడు. అతడి స్కోరులో 11 బౌండరీలు ఉన్నాయి. టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంగ్లండ్ ఇంకా 238 పరుగులు వెనుకబడి ఉంది.
కాగా, ఆటలో కోహ్లీ, బెయిర్ స్టో మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఒకరిపై ఒకరు మాటలు విసురుకున్నారు. దాంతో అంపైర్లు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. బెయిర్ స్టోకు వేలు చూపిస్తూ కోహ్లీ ఆగ్రహావేశాలు ప్రదర్శించాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.