Amit Shah: ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణలో బీజేపీదే విజయం: అమిత్షా
- మంత్రగాళ్ల మాటలు వినే కేసీఆర్ సచివాలయానికి వెళ్లలేదు
- మూఢ నమ్మకాలున్న వ్యక్తి సీఎంగా ఉండొద్దు
- తెలంగాణ తిరోగమనంలో పడిందని వ్యాఖ్య
ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ విజయం సాధిస్తుందని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన బీజేపీ ‘విజయ సంకల్ప సభ’లో అమిత్ షా ప్రసంగించారు. తన కుమారుడు కేటీ రామారావును సీఎం చేయాలనేదే కేసీఆర్ ఆలోచన అని, తెలంగాణ ప్రజల గురించి ఆయనకు అవసరం లేదని విమర్శించారు. రాష్ట్రంలో యువతకు ఉపాధి లేదని.. కేసీఆర్ దృష్టిలో యువతకు ఉపాధి అంటే తన కుమారుడిని ముఖ్యమంత్రిని చేసుకోవడమేనని మండిపడ్డారు. దేశం ముందుకు వెళుతుంటే.. తెలంగాణ తిరోగమనంలో పడిపోయిందని వ్యాఖ్యానించారు.
ఎంఐఎం చేతిలో టీఆర్ఎస్ స్టీరింగ్
టీఆర్ఎస్ పార్టీ గుర్తు కారు అని.. కానీ దాని స్టీరింగ్ మాత్రం ఎంఐఎం, ఓవైసీల చేతుల్లో ఉందని అమిత్ షా విమర్శించారు. అందుకే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని మండిపడ్డారు. అసలు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని టీఆర్ఎస్ ఎందుకు వ్యతిరేకిస్తోందని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కు మూఢ నమ్మకాలు ఎక్కువని.. అందుకే ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్నా సచివాలయానికి వెళ్లలేదని ఆరోపించారు. కేసీఆర్ ఆ సచివాలయానికి వెళితే ప్రభుత్వం కూలిపోతుందని మంత్రగాళ్లు చెప్పారన్న ఉద్దేశమే దీనికి కారణమన్నారు. ఇలాంటి నమ్మకాలున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగడం సరికాదని వ్యాఖ్యానించారు. అయినా ఇక ముందు సచివాలయానికి వెళ్లేది బీజేపీ ముఖ్యమంత్రే అని అమిత్ షా పేర్కొన్నారు.