Narendra Modi: డబుల్ ఇంజిన్ సర్కారుకు తెలంగాణ ప్రజలు పట్టాలు వేస్తున్నారు: ప్రధాని మోదీ

PM Modi speech at Vijay Sankalp Sabha in Secunderabad

  • సికింద్రాబాద్ లో బీజేపీ విజయసంకల్ప సభ
  • హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ
  • తెలంగాణ గడ్డకు శిరసు వంచి నమస్కారం
  • సంస్కృతి, పరాక్రమాల గడ్డ అని కొనియాడిన వైనం

ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రసంగించారు. తన ప్రసంగం మొదట్లో ఆయన తెలుగులో మాట్లాడి అలరించారు. తెలంగాణ బీజేపీని ఆశీర్వదించడానికి ఎంతో దూరం నుంచి వచ్చిన కార్యకర్తలకు, సోదరసోదరీమణులకు, మాతృమూర్తులకు అందరికీ కృతజ్ఞతలు అంటూ పేర్కొన్నారు. తెలంగాణ గడ్డకు ఈ సందర్భంగా శిరసు వంచి నమస్కరిస్తున్నానని తెలిపారు. ఈ సభకు హాజరైన ప్రజల ప్రేమను చూసి ముగ్ధుడ్నవుతున్నానని వెల్లడించారు. 

హైదరాబాద్ నగరం అన్ని వర్గాల వారికి అండగా నిలుస్తోందని అన్నారు. హైదరాబద్ నగరం ప్రతిభకు పట్టం కడుతుందని వ్యాఖ్యానించారు. యాదాద్రి నరసింహస్వామి, ఆలంపూర్ జోగులాంబ, వరంగల్ భద్రకాళిలతో కూడిన పవిత్రభూమి తెలంగాణ అని, వారి ఆశీస్సులు దేశం మొత్తానికి ఉంటాయని అని పేర్కొన్నారు. ప్రతాపరుద్రుడు, రాణి రుద్రమదేవి నుంచి కొమురం భీమ్ వరకు తెలంగాణ పరాక్రమానికి ప్రతీకలు అని మోదీ వివరించారు. 

భద్రాచలం రామదాసు నుంచి పాల్కురికి సోమనాథుడి వరకు సాహితీ సౌరభాలు వెదజల్లినవారేనని, భారతదేశానికి ఎనలేని నిధి వంటి వారని కొనియాడారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, వాస్తుశిల్పకళలు అందరికీ గర్వకారణమని అన్నారు. తెలంగాణ ప్రజలు లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఆదరించారని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ బీజేపీకి మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు. తెలంగాణ ప్రజలకు బీజేపీపై నమ్మకం ఎన్నో రెట్లు పెరిగిందని వెల్లడించారు. 

డబుల్ ఇంజిన్ సర్కారు కోసం తెలంగాణ ప్రజలు పట్టాలు వేస్తున్నారని మోదీ పేర్కొన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్న రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని వివరించారు. సబ్ కా సాథ్... సబ్ కా వికాస్ మంత్రంతో తెలంగాణ అభివృద్ధి సాధ్యమని చెప్పారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ఎనిమిదేళ్లుగా ప్రయత్నించామని వెల్లడించారు. దేశాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం పెంచేందుకు కృషి చేశామని తెలిపారు.

  • Loading...

More Telugu News