Rains: రేపు, ఎల్లుండి ఏపీలో భారీ వర్షాలు
- దక్షిణ ఝార్ఖండ్ పరిసరాల్లో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్న వాతావరణశాఖ
- అరేబియా సముద్రం నుంచి మధ్య భారతం మీదుగా బలమైన గాలులు
- దేశవ్యాప్తంగా కురుస్తున్న వానలు
ఆంధ్రప్రదేశ్‌లో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే, వచ్చే 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బంగ్లాదేశ్ పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వాయవ్యంగా పయనించి నిన్న దక్షిణ ఝార్ఖండ్ పరిసరాల్లో కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో అక్కడే నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
దీనికితోడు అరేబియా సముద్రం నుంచి మధ్యభారతం మీదుగా బలమైన గాలులు వీస్తున్నట్టు పేర్కొన్నారు. వీటి ప్రభావంతో దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కాగా, ఉత్తర కోస్తాలో పలుచోట్ల నిన్న ఉరుములతో కూడిన వర్షాలు పడ్డాయి.