Ukraine: స్లోవియానస్క్ వైపు రష్యా దళాలు.. డోనెట్స్క్ పై పూర్తి ఆధిపత్యానికి ప్రయత్నాలు
- ఇప్పటికే లుహానస్క్ ప్రాంతాన్ని స్వాధీనంలోకి తెచ్చుకున్న రష్యా
- ఇప్పుడు డోనెట్స్క్ వైపు దృష్టి సారించిన పుతిన్ సేన
- మొత్తంగా డోన్బాస్ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తెచ్చుకునే ఉద్దేశం
- వివరాలు వెల్లడించిన లూహానస్క్ రీజియన్ గవర్నర్ సెర్హీ గైడై వెల్లడి
ఉక్రెయిన్ లోని డోన్బాస్ ప్రాంతాన్ని పూర్తిగా తమ చేజిక్కించుకునే దశగా రష్యా అడుగులు వేస్తోంది. డోన్బాస్ ప్రాంతంలో లూహానస్క్, డోనెట్స్క్ రెండు ప్రధాన రీజియన్లు కాగా.. అందులో ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతంలో కీలకమైన లూహానస్క్ ప్రాంతంలోని లిసిచాన్స్క్ నగరాన్ని పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకున్నట్టు రష్యా రక్షణ శాఖ ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయా ప్రాంతాల్లో ఉక్రెయిన్ దళాలకు, రష్యా సేనలకు మధ్య పోరాటం సాగుతుండగా.. రష్యాకు ఉక్రెయిన్ వేర్పాటు వాద వర్గాలు సాయం చేస్తున్నాయి. వారి సాయంతో రష్యా వేగంగా ముందుకు సాగుతోంది.
ఇక స్లోవియానస్క్ వైపు..
లిసిచానస్క్ నగరం, ఆ చుట్టు పక్కల గ్రామాలను తమ అధీనంలోకి తీసుకుని లుహానస్క్ ప్రాంతంపై పట్టు బిగించిన రష్యా.. డోనెట్స్క్ ను అధీనంలోకి తెచ్చుకునేందుకు స్లోవియానస్క్, బఖ్ముత్ నగరాలపై దృష్టి పెట్టిందని లుహానస్క్ రీజీయిన్ గవర్నర్ సెర్హీ గైడే తెలిపారు. ఆ నగరాల వైపుగా రష్యా దళాలు కదులుతున్నాయని, త్వరలోనే భారీ ఎత్తున దాడులకు తెగబడవచ్చని పేర్కొన్నారు.
లిసిచానస్క్ నగరాన్ని కోల్పోవడం ఓటమి కాదని.. అంతిమంగా యుద్ధంలో రష్యాపై గెలుపొందడమే ఉక్రెయిన్ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. రష్యన్ దళాలు ఒకే చోట ఉండిపోలేవని.. వారు అక్కడి నుంచి ముందుకు కదిలినప్పుడు తాము వెంటనే ఆయా నగరాలను స్వాధీనం చేసేసుకుంటామని తెలిపారు.