Somu Veerraju: మోదీ పర్యటన సందర్భంగా కొన్ని దుష్ట శక్తులు భారీ కుట్రకు పాల్పడ్డాయి: సోము వీర్రాజు
- మోదీ హెలికాప్టర్ టేకాఫ్ అయిన సమయంలో గాల్లోకి లేచిన బెలూన్లు
- నల్ల బెలూన్లతో నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ యత్నం
- దుష్ట శక్తులను గుర్తించి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన వీర్రాజు
ప్రధాని మోదీ ఏపీ పర్యటన సందర్భంగా ఇంటెలిజెన్స్ వైఫల్యం బయటపడింది. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి భీమవరంకు మోదీ, జగన్ వెళ్తుండగా కాంగ్రెస్ శ్రేణులు డజన్ల కొద్దీ ఎయిర్ బెలూన్లను గాల్లోకి వదిలారు. ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి రాజీవ్ రతన్ నేతృత్వంలో బెలూన్లను యువకులు వదిలినట్టు సమాచారం. మోదీ రాక సందర్భంగా విమానాశ్రయం వద్ద నిరసన తెలపడానికి కాంగ్రెస్ మహిళా నేత సుంకర పద్మశ్రీ వచ్చారు. మరోవైపు ఎయిర్ పోర్టు సమీపంలో నిరసన తెలిపేందుకు ఎమ్మార్పీఎస్ నేతలు ప్రయత్నించారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బెలూన్లను ఎగురవేసిన ఘటనపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ, కొన్ని దుష్టశక్తులు బెలూన్లను ఎగురవేశాయని మండిపడ్డారు. నల్ల బెలూన్లను గాల్లోకి పంపడం ద్వారా భార కుట్రకు పాల్పడ్డారని అన్నారు. దీనిపై ప్రభుత్వం విచారణ జరపాలని... దుష్ట శక్తులను వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.