Delhi: భారీగా పెరిగిన ఢిల్లీ ఎమ్మెల్యేల వేతనం!
- ప్రస్తుతం ఢిల్లీలో ఒక్కో ఎమ్మెల్యేకు వేతనం, అలవెన్సులు కలిపి రూ.54 వేలు
- దానిని రూ.90 వేలకు పెంచుతూ కేజ్రీవాల్ సర్కారు ప్రతిపాదన
- బిల్లుకు ఆమోదం తెలిపిన ఢిల్లీ అసెంబ్లీ
- కేంద్రం కూడా ఆమోదిస్తేనే ఎమ్మెల్యేల వేతనాల పెంపు అమలు
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ సర్కారు సోమవారం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ ఎమ్మెల్యేల వేతనాలను భారీగా పెంచింది. ఈ మేరకు అసెంబ్లీలో కేజ్రీవాల్ సర్కారు ప్రతిపాదించిన బిల్లుకు ఆమోద ముద్ర లభించింది. ప్రస్తుతం ఢిల్లీ ఎమ్మెల్యేలకు నెలకు వేతనాలు, అలవెన్సులు కలిపి రూ.54 వేలు అందుతోంది. ఇకపై ఇది రూ.90 వేలకు పెరగనుంది.
ఇదిలా ఉంటే... దేశంలోని దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల వేతనాలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో ఒక్కో ఎమ్మెల్యేకు అలవెన్సులతో కలిపి హీనపక్షం రూ.2.5 లక్షలు అందుతున్నాయి. అయితే గడచిన 11 ఏళ్లుగా ఢిల్లీ ఎమ్మెల్యేలకు వేతనాలు పెరగలేదు.
మరోవైపు ఎమ్మెల్యేల వేతనాలు పెంచుతూ డిల్లీ అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపితేనే ఈ బిల్లు చట్టంగా మారుతుంది. గడచిన ఏడేళ్లుగా ఈ విషయంపై ఢిల్లీ సర్కారు, కేంద్ర ప్రభుత్వం మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఇదే అంశాన్ని తాజాగా ప్రస్తావించిన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా... ఈ సారి అయినా కేంద్రం ఈ బిల్లుకు ఆమోదం తెలుపుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.