Raghu Rama Krishna Raju: ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తే కానీ ఏపీలో అడుగుపెట్టలేనేమో!: రఘురామకృష్ణరాజు
- పోలీసులు జగన్ చెప్పుచేతల్లో లేనప్పుడు మాత్రమే ఏపీలో అడుగుపెట్టగలనన్న రఘురామరాజు
- తనను అభిమానించే ఎంతోమందిని పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని వివరణ
- వారి క్షేమాన్ని కాంక్షించే అల్లూరి విగ్రహావిష్కరణకు వెళ్లలేదన్న ఎంపీ
- హైదరాబాద్లోని ఎంపీ ఇంటి వద్ద తిరుగుతున్న ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ అరెస్ట్
ఆంధ్రప్రదేశ్లో తాను ఇప్పట్లో అడుగుపెట్టలేనేమోనని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు అన్నారు. ఎన్నికల నియామావళి అమల్లోకి వచ్చి ముఖ్యమంత్రి జగన్ చేతుల్లో పోలీసులు లేనప్పుడు మాత్రమే తాను ఏపీలో అడుగుపెట్టగలనని పేర్కొన్నారు. తనను అభిమానించే ఎంతోమందిని పోలీసులు అదుపులోకి తీసుకుని చిత్రహింసలకు గురిచేశారని, వారి క్షేమాన్ని కాంక్షించే తాను అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు వెళ్లలేదని అన్నారు. నిన్న ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ఎంపీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు యువకులను పోలీసులు కారులో ఎక్కించుకుని ఎక్కడికో తీసుకెళ్లారని వారి తండ్రి తనకు ఫోన్ చేసి చెప్పారన్నారు. తన కారణంగా చిత్రహింసలకు గురైనవారు తనను క్షమించాలని వేడుకున్నారు. ఎంపీలు అంటే చట్టాలు చేసేవారని ప్రజలు అనుకుంటారని, కానీ చట్టాలు చేసే ఒక ఎంపీ కూడా సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
తన నియోజకవర్గంలో జరిగే కార్యక్రమంలో తాను పాల్గొనకపోతే ప్రధానమంత్రి తప్పుగా అనుకుంటారేమోనని భావించానని, కానీ పీఎంవో నుంచి వచ్చిన ఆహ్వానితుల జాబితాలో తన పేరు లేకపోవడంతో ఇప్పుడు ఎలాంటి ఆందోళన లేదని రఘురామరాజు అన్నారు. పార్లమెంటరీ లా జస్టిస్, పబ్లిక్ గ్రీవెన్స్ కమిటీ సభ్యుడినైన తనకు జరిగిన అన్యాయం దేశంలో ఇంకెవరికీ జరగలేదని పేర్కొన్నారు.