YSRCP: నాడు తొడల్లోతు, నేడు పాదాలు మునిగే లోతు... బ్రిడ్జి కోసం మురుగునీటిలో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి వినూత్న నిరసన
- నెల్లూరు రూరల్ పరిధిలో బ్రిడ్జి కోసం కోటంరెడ్డి వినూత్న నిరసన
- మురుగు నీటి కాల్వలోకి దిగి నిరసన వ్యక్తం చేసిన వైనం
- ఇదే కాలువలో 2018లోనూ నిరసనకు దిగిన వైసీపీ ఎమ్మెల్యే
వైసీపీ కీలక నేత, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రూటే సపరేటు. విపక్షంలో ఉన్నా... అధికార పక్షంలో ఉన్నా.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏ తరహా నిరసనలు, ఆందోళనలకు అయినా ఆయన సిద్ధం. తన నియోజకవర్గ పరిధిలోని ఓ ప్రాంతంలో మురుగు నీటి కాల్వపై బ్రిడ్జి నిర్మాణం కోసం టీడీపీ అధికారంలో ఉండగా... 2018లో తొడల్లోతు మురుగు నీటిలో దిగి ఏకంగా గంట పాటు మురుగులోనే నిరసన కొనసాగించారు. ఈ విషయం తెలుసుకున్న అధికార యంత్రాంగం పరుగు పరుగున అక్కడికి వచ్చి 45 రోజుల్లో బ్రిడ్జిని ఏర్పాటు చేస్తామంటూ హామీ ఇవ్వడంతో నాడు కోటంరెడ్డి నిరసన విరమించారు.
తాజాగా అదే మురుగు నీటి కాలువలో... తన సొంత పార్టీ వైసీపీ అధికారంలో ఉండగా... అదే బ్రిడ్జి కోసం కోటంరెడ్డి మంగళవారం నిరసనకు దిగారు. మంగళవారం నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంగా తాను నిరసనకు దిగిన కాలువపై బ్రిడ్జి ఏర్పాటు కాని వైనాన్ని గుర్తించిన కోటంరెడ్డి మునుపటి మాదిరే అధికారుల తీరుకు నిరసనగా మురుగునీటిలోకి దిగారు.
అయితే నాడు తొడల్లోతు మురుగు నీరు ఉండగా... ఇప్పుడది పాదాలు మునిగే దాకా మాత్రమే ఉంది. ఈ సారి అధికారుల సమక్షంలోనే కోటంరెడ్డి మురుగు నీటిలోకి దిగారు. మురుగు నీటిలో కాసేపు నిలబడ్డ కోటంరెడ్డి కాలువ గట్టుపై అలా కూర్చుండిపోయారు. 15 రోజుల్లోగా సమస్యను పరిష్కరిస్తామని అధికారులు చెప్పడంతో కోటంరెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
.