Sri Lanka: ‘గోట గో హోమ్’ శ్రీలంక పార్లమెంటులో ఎంపీల నిరసన.. వెళ్లిపోయిన అధ్యక్షుడు గోటబాయ రాజపక్స
- ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపిన పార్లమెంటు సభ్యులు
- వీడియో తీసి ట్విట్టర్ లో పెట్టిన ఎంపీ హర్ష డిసల్వా
- శ్రీలంక అప్పులు కట్టలేక ఎగవేతదారుగా మారిందని ప్రధాని రణిల్ విక్రమసింఘే వ్యాఖ్య
శ్రీలంక పార్లమెంటులో ఆ దేశ అధ్యక్షుడు గోటబాయ రాజపక్సకు చేదు అనుభవం ఎదురైంది. మంగళవారం పార్లమెంటుకు వచ్చిన ఆయనపై ఎంపీలు తీవ్రంగా మండిపడ్డారు. అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. నిరసనకు దిగారు. నిలబడి ‘గోట గో హోమ్’ అని నినాదాలు చేశారు. వారు ఎంతకీ వెనక్కి తగ్గకపోవడంతో అధ్యక్షుడు గోటబాయ రాజపక్స, ఆయన అనుచరులు పార్లమెంటును వీడి బయటికి వెళ్లిపోయారు. ఆ దేశం ఎంపీ హర్ష డిసల్వా దీనంతటినీ వీడియో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
‘‘ఓహ్.. శ్రీలంక అధ్యక్షుడు గోటబాయ రాజపక్స పార్లమెంటుకు వచ్చిన కొన్ని నిమిషాలు పాటు నెలకొన్న దృశ్యమిది. చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా, అనుకోకుండానే ఈ నిరసన జరిగింది. అధ్యక్షుడు పార్లమెంటును వీడి వెళ్లిపోవాల్సి వచ్చింది..” అని హర్ష డిసల్వా పేర్కొన్నారు.
ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక
శ్రీలంక కొంతకాలంగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. విద్యుత్, పెట్రోల్, డీజిల్ సరఫరా సరిగా లేక.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీలంక ప్రధాన మంత్రి రణిల్ విక్రమ సింఘే కూడా ఈ విషయాన్ని పార్లమెంటు సమావేశాల్లో అధికారికంగా ప్రకటించారు. విదేశాల నుంచి తెచ్చిన అప్పులు కట్టలేక శ్రీలంక ఎగవేతదారుగా మారిందని పేర్కొన్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్), ఇతర ప్రపంచ దేశాలతో ఆర్థిక సాయం విషయంగా చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు.