Asaduddin Owaisi: షాజహాన్ తాజ్ మహల్ నిర్మించడం వల్లే దేశంలో పెట్రోల్ ధరలు పెరిగాయి: బీజేపీపై ఒవైసీ వ్యంగ్యం
- ప్రతిదానికి ముస్లింలను బాధ్యుల్ని చేస్తున్నారని ఒవైసీ విమర్శ
- మొఘలులే కారకులంటున్నారని వ్యాఖ్యలు
- సెటైరికల్ వీడియో విడుదల చేసిన ఒవైసీ
దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలన్నింటికీ మొఘలులు, ముస్లింలే కారణమన్నట్టుగా బీజేపీ మాట్లాడుతోందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. "దేశంలోని యువత నిరుద్యోగంతో బాధపడుతోంది, ద్రవ్యోల్బణం అంతకంతకు పెరిగిపోతోంది, లీటర్ డీజిల్ రూ.102 పలుకుతోంది... వీటన్నింటికీ కారకుడు ఔరంగజేబట... ప్రధాని మోదీ కాదట" అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.
"ఉద్యోగాలు లేకపోవడానికేమో అక్బర్ కారకుడు, పెట్రోల్ ధరలు మండిపోవడానికేమో తాజ్ మహల్ నిర్మించినవాళ్లు కారణం. షాజహాన్ గనుక తాజ్ మహల్ కట్టకపోయుంటే దేశంలో ఇవాళ లీటర్ పెట్రోల్ ధర రూ.40 మాత్రమే ఉండేది" అంటూ సెటైర్ వేశారు.
"షాజహాన్ తాజ్ మహల్ ను, ఎర్రకోటను నిర్మించడం తప్పే అని ఒప్పుకుంటున్నా. షాజహాన్ అవి కట్టకుండా ఆ డబ్బును పొదుపు చేసి 2014లో మోదీకి అందించాల్సింది. ఇలా ప్రతి అంశంలో ముస్లింలే బాధ్యులంటున్నారు, మొఘలులే కారకులంటున్నారు" అంటూ అసదుద్దీన్ ఒవైసీ ఓ వీడియోలో పేర్కొన్నారు.