Andhra Pradesh: ఎంపీ రఘురామకృష్ణరాజుపై తెలంగాణలో పోలీస్ కేసు నమోదు
- ఎంపీపై ఫిర్యాదు చేసిన ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్
- ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు
- ఎంపీ కుమారుడు, పీఏలను నిందితులుగా చేర్చిన వైనం
- నిందితుల జాబితాలో సీఐఎస్ఎఫ్ ఏఎస్ఐ, కానిస్టేబుల్
ఏపీలో అధికార పార్టీ వైసీపీ టికెట్‌పై ఎంపీగా గెలిచి ఆ పార్టీకి రెబల్‌గా మారిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై తెలంగాణలో పోలీసు కేసు నమోదైంది. హైదరాబాద్ నగర పరిధిలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది. ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రఘురామరాజుపై కేసు నమోదు చేసినట్లు గచ్చిబౌలి పోలీసులు తెలిపారు.
రఘురామరాజుపై నమోదు చేసిన ఈ కేసులో ఆయన కుమారుడు భరత్, పీఏ శాస్త్రిలతో పాటు సీఆర్‌పీఎఫ్ కు చెందిన ఏఎస్ఐ, కానిస్టేబుళ్లనూ నిందితులుగా చేర్చారు. అనుమతి లేకుండా తన ఇంటి వద్ద నిఘా పెట్టారంటూ ఏపీ ఇంటెలిజెన్స్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌ను రఘురామరాజు అనుచరులు అదుపులోకి తీసుకున్న వ్యవహారంలో ఈ కేసు నమోదైంది.