AB Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరరావుపై ఏసీబీ కేసు పరిస్థితి ఏంటి?... ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న!
- ఏసీబీ కేసును కొట్టేయాలని ఏబీవీ పిటిషన్
- కేసు నమోదు చేసి ఏడాది అవుతున్నా చార్జిషీట్ దాఖలు చేయలేదని వెల్లడి
- 4 వారాలు గడువు కావాలన్న రాష్ట్ర ప్రభుత్వం
- అందుకు తిరస్కరించి 2 వారాల గడువు ఇచ్చిన వైనం
- తదుపరి విచారణ ఈ నెల 19కి వాయిదా
ఏపీ కేడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై నమోదైన ఏసీబీ కేసు వ్యవహారంపై మంగళవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. తనపై నమోదైన ఏసీబీ కేసును కొట్టివేయాలంటూ ఏబీవీ ఇటీవలే హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్పై మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు.. అసలు ఈ కేసు తాజా పరిస్థితి ఏమిటో చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
తనపై నిబంధనలకు విరుద్ధంగా ఏసీబీ కేసు నమోదు చేశారని ఏబీవీ తన పిటిషన్లో ఆరోపించారు. అంతేకాకుండా కేసు నమోదు చేసి ఇప్పటికే ఏడాది దాటి 3 నెలలు అవుతున్నా...కోర్టులో చార్జిషీటే దాఖలు చేయలేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
ఈ వాదనలతో స్పందించిన హైకోర్టు కేసు తాజా పరిస్థితిని తెలియజేయాలని ప్రభుత్వాన్ని కోరింది. ఇందుకోసం 4 వారాల గడువు కావాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోరగా.. అందుకు తిరస్కరించిన కోర్టు 2 వారాల గడువు ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈ పిటిషన్పై తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది.