Rahul Dravid: మ్యాచ్ మూడ్రోజుల పాటు మా నియంత్రణలోనే ఉంది... కానీ!: టెస్టు ఓటమిపై కోచ్ రాహుల్ ద్రావిడ్ వివరణ
- బర్మింగ్ హామ్ లో టీమిండియా ఓటమి
- 7 వికెట్ల తేడాతో నెగ్గిన ఇంగ్లండ్
- అవకాశాలు వచ్చినా వినియోగించుకోలేకపోయామన్న ద్రావిడ్
- ప్రత్యర్థి జట్టును అభినందించాల్సిందేనని కామెంట్
తొలి ఇన్నింగ్స్ లో 416 పరుగులు చేసి, రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ ముందు 378 పరుగుల లక్ష్యాన్ని ఉంచినా టీమిండియా ఓటమి తప్పించుకోలేకపోయింది. ఇంగ్లండ్ జట్టు అద్భుత రీతిలో చేజింగ్ చేసి మ్యాచ్ ను గెలవడంతో పాటు సిరీస్ ను సమం చేసింది. ఈ మ్యాచ్ లో టీమిండియాకు కూడా గెలుపు అవకాశాలు లభించినా, బుమ్రా నాయకత్వంలోని జట్టు సద్వినియోగం చేసుకోలేకపోయింది. దీనిపై టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ స్పందించారు.
మ్యాచ్ మూడ్రోజుల పాటు తమ నియంత్రణలోనే ఉందని, కానీ అదే తీవ్రతను చివరి వరకు కొనసాగించలేకపోయామని వెల్లడించారు. రెండో ఇన్నింగ్స్ లో పేలవంగా బ్యాటింగ్ చేయడమే కొంపముంచిందని అభిప్రాయపడ్డారు.
కానీ ఈ మ్యాచ్ లో విజయానికి ఇంగ్లండ్ ఆటగాళ్లు అర్హులేనని, ఆ క్రెడిట్ వాళ్లకు ఇవ్వాల్సిందేనని అన్నారు. రూట్, బెయిర్ స్టో తిరుగులేని భాగస్వామ్యం నమోదు చేశారని, తమకు రెండు మూడు చాన్సులు లభించినా ఉపయోగించుకోలేకపోయామని తెలిపారు. మ్యాచ్ ఫలితం తమను నిరాశకు గురిచేసిందని ద్రావిడ్ పేర్కొన్నారు.
దక్షిణాఫ్రికా పర్యటనలోనూ ఇలాగే జరిగిందని, కొన్ని అవకాశాలు లభించినా ఉపయోగించుకోలేకపోయామని, దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గత కొన్నేళ్లుగా టీమిండియా టెస్టుల్లో ఎంతో పురోగతి సాధించిందని, ప్రత్యర్థి జట్టులోని 20 వికెట్లను పడగొట్టడంతో పాటు మ్యాచ్ లను కూడా గెలిచిందని, కానీ గత కొన్నినెలలుగా టీమిండియా ఈ అంశంలో వైఫల్యం చెందుతోందని వివరించారు. టెస్టు మ్యాచ్ జరిగే ఐదు రోజుల పాటు ఫిట్ నెస్ ను, గెలుపు కాంక్షను కొనసాగించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.