Agniveer: విశాఖలో 'అగ్నివీర్' రిక్రూట్ మెంట్ ర్యాలీ... వివరాలు ఇవిగో!
- ఆగస్టు 14 నుంచి 31 వరకు రిక్రూట్ మెంట్
- ఈ నెలాఖరుతో ముగియనున్న రిజిస్ట్రేషన్ గడువు
- ఉత్తరాంధ్ర జిల్లాల వారికి అవకాశం
- యానాం ఉద్యోగార్థులకూ చాన్స్
ఇటీవల కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ సైనిక నియామక విధానం అనుసరించి విశాఖలో ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్ మెంట్ ర్యాలీ ఏర్పాటు చేశారు. ఏపీలోని 13 జిల్లాలు, యానాం కేంద్రపాలిత ప్రాంతం వారి కోసం ఈ రిక్రూట్ మెంట్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు రక్షణ శాఖ వివరాలు తెలిపింది.
ఏపీలోని విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం, ఉభయగోదావరి జిల్లాలు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, కాకినాడ, ఎన్టీఆర్, అనకాపల్లి, ఏలూరు, కోనసీమ, కృష్ణా, యానాం ప్రాంతం వారు ఈ రిక్రూట్ మెంట్ లో పాల్గొనవచ్చు. వీరికి ఆగస్టు 13 నుంచి 31వ తేదీ వరకు విశాఖలో ఎంపికలు ఉంటాయి. అగ్నివీరుల ఎంపిక ప్రక్రియకు ఇక్కడి ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వేదికగా నిలవనుంది.
ఈ రిక్రూట్ మెంట్ కు హాజరవ్వాలని కోరుకునే వారు జులై 30వ తేదీ లోగా ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రక్షణ శాఖ వెల్లడించింది. ఆగస్టు 7న ఆన్ లైన్ విధానంలో హాల్ టికెట్లు జారీ చేస్తామని తెలిపింది.
ఆర్మీ కాలింగ్ మొబైల్ యాప్ ద్వారా అభ్యర్థులు తమ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చని వివరించింది. అంతేకాకుండా, విశాఖ ఆర్మీ రిక్రూట్ మెంట్ కార్యాలయానికి 0891-2756959,0891-2754680 నెంబర్లకు ఫోన్ చేయడం ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొంది.