Gowtham Raju: టాలీవుడ్‌లో మరో విషాదం.. ఎడిటర్ గౌతంరాజు కన్నుమూత
- కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గౌతం రాజు
- తెలుగులో పలు హిట్ సినిమాలకు ఎడిటింగ్
- 1982లో ‘దేఖ్ఖబర్ రఖ్ నజర్’ సినిమాతో కెరియర్ ప్రారంభం
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. కొన్ని వందల సినిమాలకు ఎడిటర్‌గా పనిచేసిన గౌతంరాజు కన్నుమూశారు. ఆయన వయసు 68 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో తుది శ్వాస విడిచారు.
నాలుగు దశాబ్దాల కెరియర్‌లో 800 చిత్రాలకు పైగా ఎడిటర్‌గా పనిచేసిన ఆయన తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాలకూ ఎడిటర్‌గా చేశారు. ఇటీవల కాలంలో తెలుగులో ఠాగూర్, పొలిటికల్ రౌడీ, అశోక్, ఏక్ నిరంజన్, ఖైదీ నంబర్ 150, గబ్బర్ సింగ్, కాటమరాయుడు, కిక్, రేసుగుర్రం, గోపాల గోపాల, అదుర్స్, బలుపు, రచ్చ, ఊసరవెల్లి, మిరపకాయ్ వంటి హిట్ సినిమాలకు ఎడిటింగ్ బాధ్యలు నిర్వర్తించారు.
15 జనవరి 1954లో మద్రాసులో గౌతంరాజు జన్మించారు. 1982లో ‘దేఖ్ఖబర్ రఖ్ నజర్’ అనే సినిమాతో ఎడిటింగ్ కెరియర్‌ను ప్రారంభించారు. ఇండస్ట్రీలో అత్యుత్తమ ఎడిటర్‌గా పేరు సంపాదించుకున్నారు. 'ఆది' సినిమా ఎడిటింగ్‌కు గాను 2002లో నంది అవార్డు అందుకున్నారు.