cm kcr: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. ఇక అన్ని గురుకులాల్లో ఇంటర్ విద్య
- ఈ ఏడాది నుంచే ప్రవేశ పెట్టాలని అధికారులకు సీఎం ఆదేశం
- పోటీ పరీక్షకు శిక్షణ ఇచ్చేందుకు జిల్లాకు 4 చొప్పున 132 స్టడీ సర్కిళ్ల ఏర్పాటుకు నిర్ణయం
- మోడల్ స్టడీ సర్కిళ్లను నిర్వచించేందుకు మార్గదర్శకాలను రూపొందించాలని ఆదేశాలు
తెలంగాణలో ఎంతో మందికి విద్యను అందిస్తున్న గురుకుల పాఠశాలలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పదో తరగతి వరకు విద్యనందిస్తున్న రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలల్లో ఇంటర్మీడియెట్ విద్యను కూడా ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈమేరకు ఈ విద్యా సంవత్సరం నుంచే తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థినీ, విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యనందించడం, పోటీ పరీక్షలకు శిక్షణనివ్వడం, గురుకుల పాఠశాలను ఇంటర్మీడియెట్ కళాశాలలుగా ఉన్నతీకరించడం తదితర అంశాలపై ప్రగతి భవన్ లో సీఎం ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ప్రస్తుతం గురుకులాల్లో పదో తరగతి వరకు విద్యా బోధన జరుగుతోంది. ప్రైవేటు స్కూళ్లకు ఫలితాలు అందిస్తున్న గురుకులాల్లో సీట్లకు కొన్నేళ్లుగా భారీ పోటీ నెలకొంది.
ఇక, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్టడీ సర్కిళ్లు కేవలం పోటీ పరీక్షల శిక్షణా కేంద్రాలుగానే కాకుండా, యువతకు ఉద్యోగ, ఉపాధిని అందించే భరోసా కేంద్రాలుగా అభివృద్ధి చెందాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఒక్కో వర్గానికి ఒకటి... జిల్లాకు 4 చొప్పున మొత్తం 132 స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయాలని సీఎం తెలిపారు. ఇవి కేవలం రాష్ట్రస్థాయి ఉద్యోగాల కోసమే కాకుండా దేశవ్యాప్తంగా ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, బ్యాంకింగ్ తదితర రంగాల్లో కూడా ఉద్యోగ శిక్షణను అందించాలన్నారు.
స్టడీ సర్కిళ్ల ద్వారా దేశవ్యాప్తంగా ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల వివరాలు సహా యువత చదువుకు తగ్గ ఉద్యోగ, ఉపాధి సమాచారాన్ని, గైడెన్స్ ను అందించే కేంద్రాలుగా తీర్చిదిద్దాలని కేసీఆర్ అధికారులకు మార్గనిర్దేశం చేశారు. అదే సమయంలో మోడల్ స్టడీ సర్కిళ్లను నిర్వచించేందుకు మార్గదర్శకాలను రూపొందించాలన్నారు. ఇవి ప్రభుత్వ రంగంలోనే కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా ఉపాధి కల్పించే కేంద్రాలుగా మారాలన్నారు.
స్టడీ సర్కిళ్లలో శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు అక్కడే భోజనం అందించి, వారికి కంప్యూటర్లు, అత్యాధునిక సాంకేతిక మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. సివిల్స్, గ్రూప్ I పరీక్షలకు అత్యున్నత శిక్షణ అందించడానికి, ‘ఆలిండియా సర్వీసెస్ స్టడీ సర్కిల్ ఆఫ్ తెలంగాణ స్టేట్’ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.