Telangana: తెలంగాణకు భారీ షాక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
- రాష్ట్రం తీసుకునే రుణాల్లో భారీ కోత విధించిన కేంద్రం
- రూ. 52,167 కోట్ల రుణాలకు ప్రతిపాదనలు పంపిన రాష్ట్ర ప్రభుత్వం
- రూ. 19 వేల కోట్ల మేర కోత విధించిన కేంద్ర ప్రభుత్వం
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం భారీ షాకిచ్చింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం తీసుకునే రుణాల్లో భారీగా కోతను విధించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 52,167 కోట్ల రుణాలను తీసుకోవడానికి కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. అయితే ఇందులో రూ. 19 వేల కోట్ల మేర కేంద్రం కోత విధించింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 33 వేల కోట్లకు మించి అప్పు చేయలేని పరిస్థితి నెలకొంది.
రాష్ట్రాలు తీసుకుంటున్న అప్పులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా తీవ్ర ఆంక్షలను అమల్లోకి తెచ్చింది. గత రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న బడ్జెట్ అప్పులతో పాటు, వివిధ కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న రుణాలను కూడా ఎఫ్ఆర్బీఎం చట్టం పరిధిలోకి కేంద్రం తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో, గత రెండేళ్లలో ఎఫ్ఆర్బీఎం పరిధికి మించి రాష్ట్రాలు చేసిన అప్పులను... ఆమేరకు ఈ ఆర్థిక సంవత్సరంలో కోత విధించింది.
ఎఫ్ఆర్బీఎం పరిమితికి మించి కార్పొరేషన్ల పేరుతో రుణాలు తీసుకోవడంతో... ఇకపై కార్పొరేషన్లకు అప్పులు లభించకపోయే పరిస్థితి నెలకొంది. మరోవైపు తెలంగాణకు రావాల్సిన అప్పులను కేంద్రం కొంత కాలం నిలిపివేసింది. దీంతో, తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. తాజాగా రూ. 33 వేల కోట్ల వరకు రుణాలు పొందేందుకు అనుమతి లభించడంతో కొంత మేరకు ఉపశమనం లభించినట్టయింది.