Chiranjeevi: గౌతమ్‌రాజు మృతి పట్ల చిరంజీవి, బాలకృష్ణ తీవ్ర ఆవేదన
- గొప్ప ఎడిటర్ ను కోల్పోయామన్న చిరంజీవి
- వ్యక్తిగతంగా తీరని లోటు అన్న మెగాస్టార్
- తనకు ఎంతో ఆత్మీయుడన్న బాలకృష్ణ
ప్రముఖ సినిమా ఎడిటర్ గౌతమ్ రాజు మృతితో టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ కూడా గౌతమ్ రాజు మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గౌతమ్ రాజు వంటి గొప్ప ఎడిటర్ ను కోల్పోవడం బాధాకరమని చిరంజీవి అన్నారు. ఆయన వ్యక్తిత్వం ఎంత సౌమ్యంగా ఉంటుందో... ఆయన ఎడిటింగ్ కూడా అంతే వాడిగా ఉంటుందని కొనియాడారు.
ఎంతో వేగంగా ఎడిటింగ్ చేయగల నేర్పరి ఆయన అని చెప్పారు. తన సినిమాల్లో ఎన్నో చిత్రాలకు ఆయన పని చేశారని... ఇప్పుడు ఆయన మన మధ్య లేకపోవడం వ్యక్తిగతంగా తనకే కాకుండా, తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు అని అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు.
గౌతమ్ రాజు మృతి పట్ల బాలకృష్ణ స్పందిస్తూ... ఎంతో అద్భుతమైన ప్రతిభ కలిగిన ఎడిటర్ అని ప్రశంసించారు. తనకు ఎంతో ఆత్మీయులని, మృధుస్వభావి అని అన్నారు. ఎన్నో విజయవంతమైన సినిమాలకు కలిసి పని చేశామని చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమలో గౌతం రాజుది ఒక ప్రత్యేకమైన స్థానమని అన్నారు. ఆయన మన మధ్య లేకపోవడం దురదృష్టకరమని చెప్పారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు.