TRS: బీజేపీలోకి నెలకు ఒక నేతను తీసుకొస్తా..: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

I will bring atleast one leader into BJP every month says Konda Vishweshwar Reddy

  • సీఎం కేసీఆర్ ను అడ్డుకోవడం ఒక్క బీజేపీకే సాధ్యమన్న కొండా 
  • బీజేపీ చేరికల కమిటీ సభ్యుడిగా నియమించి తనకు ప్రాధాన్యమిచ్చారని వ్యాఖ్య 
  • తాను చేరుతున్న విషయం కాంగ్రెస్ సీనియర్ నేతలకు ముందే తెలుసని వెల్లడి 

తెలంగాణలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును అడ్డుకోవడం ఒక్క భారతీయ జనతా పార్టీకి మాత్రమే సాధ్యమని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ లో కాళ్లు మొక్కించుకోవడం, డబ్బులు తీసుకోవడం, కేసులతో బెదిరించడం తప్ప ఏమీ లేదని విమర్శించారు. ప్రజలకు ఎక్కడ న్యాయం జరుగుతుందంటే తాను అక్కడే ఉంటానని.. అందుకే బీజేపీలో చేరానని చెప్పారు.

ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన ప్రధాని మోదీ బహిరంగ సభ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. బీజేపీలో ఆయనకు తగిన ప్రాధాన్యమిస్తూ.. పార్టీ చేరికల సమన్వయ కమిటీలో కొండా విశ్వేశ్వర్ రెడ్డిని సభ్యుడిగా నియమించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త పార్టీ పెట్టేందుకు ఎలాంటి అవకాశం లేదని స్పష్టం చేశారు.

ఇన్నాళ్లూ తటస్థంగా ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు..  
తాను బీజేపీలో చేరుతున్న విషయం కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలందరికీ తెలుసని కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. తాను ఇన్ని రోజులు తటస్థంగా ఉన్నా ఎవరూ పట్టించుకోలేదని.. ఇప్పుడు బీజేపీలో చేరే సరికి అంతా అడుగుతున్నారని తెలిపారు. బీజేపీలో తనకు ప్రాధాన్యత ఇచ్చి చేరికల కమిటీలో అవకాశమిచ్చారని.. నెలకు ఒక్క నేతను అయినా బీజేపీలోకి తీసుకొస్తానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రకటించారు.

  • Loading...

More Telugu News