BJP: అందరికీ ఒకేసారి ఆహ్వానాలు పంపామన్న విష్ణువర్ధన్ రెడ్డి... బీజేపీ నేతను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
- ఈ నెల 4న భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ
- నేతలకు ఆహ్వానాలపై విమర్శలు
- క్లారిటీ ఇచ్చే యత్నం చేసిన బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి
- వైసీపీకి మద్దతిచ్చేందుకే విష్ణు యత్నమన్న నెటిజన్లు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 4న ఏపీలోని భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి మోదీతో పాటు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరయ్యారు. అయితే ఆహ్వానాలు అందినా కూడా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు హాజరు కాలేదు.
వీరి గైర్హాజరీపై ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కో విశ్లేషణ వినిపిస్తున్నారు. ఈ విశ్లేషణలకు చెక్‌పెట్టే దిశగా ఏపీకి చెందిన బీజేపీ యువ నేత విష్ణువర్ధన్ రెడ్డి మంగళవారం రాత్రి ఓ ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అందరికీ ఒకేసారి ఆహ్వానాలు పంపారని, నేతల గైర్హాజరీపై రాద్ధాంతం అవసరం లేదని ఆయన సదరు ట్వీట్లో విజ్ఞప్తి చేశారు.
విష్ణువర్ధన్ రెడ్డి ట్వీట్‌ను చూసిన వెంటనే పలువురు నెటిజన్లు ఆయనపై ట్రోలింగ్ మొదలెట్టేశారు. విజ్ఞప్తి ఓకే గానీ... మీరు పోస్ట్ చేసిన ఆహ్వానాల్లో ఒక్కో దానిపై ఒక్కో తేదీ ఉందని ఆయనకు నెటిజన్లు గుర్తు చేశారు. అంతేకాకుండా కొన్ని ఆహ్వానాలపై తేదీని చేతితో రాస్తే... మరికొన్నింటిపై సీల్‌తో వేసిన విషయాన్ని మరికొందరు ప్రస్తావించారు. అయినా కార్యక్రమం అయిపోయాక ఈ వివరణలేమిటని కూడా ఆయనను ప్రశ్నించారు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న కారణంగానే విష్ణువర్ధన్ రెడ్డి ఈ ట్వీట్ పోస్ట్ చేశారని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.