Science: మందు లేకుండానే నొప్పి తగ్గిపోతుంది.. సరికొత్త పరికరం సిద్ధం.. ఎలా పనిచేస్తుందంటే..!
- చిన్న ప్యాచ్ లా అతికించుకునే వెసులుబాటు
- నాడులను చల్లబర్చి, మెదడుకు సంకేతాలు వెళ్లకుండా చేసే పరికరం
- నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ పరిశోధకుల ఆధ్వర్యంలో అభివృద్ధి
- ఎలాంటి దుష్ప్రభావాలూ ఉండవని చెబుతున్న శాస్త్రవేత్తలు
ఏదైనా నొప్పి మొదలైందంటే.. తగ్గే దాకా మనసు మనసులో ఉండదు. ఓ పక్క నొప్పి ఇబ్బంది పెడుతుంటే ఏ పనీ చేయలేం. కీళ్ల నొప్పులు మొదలు ఏవైనా దెబ్బలు తగలడం వల్ల వచ్చే నొప్పుల దాకా ఏవైనా అంతే. నొప్పులు తగ్గాలంటే.. మందులు వాడాల్సిందే. కానీ వాటివల్ల ఎన్నో రకాల దుష్ప్రభావాలు. ఈ క్రమంలోనే ఎలాంటి మందులూ అవసరం లేకుండా నొప్పి తగ్గించే వినూత్నమైన పరికరాన్ని అమెరికా ఇల్లినాయిస్ లోని నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ పరిశోధకులు రూపొందించారు. నొప్పి ఉన్న చోట ఈ డివైజ్ ను ఒక క్రమ పద్ధతిలో ప్యాచ్ లా అతికించుకునే వెసులుబాటు ఉంటుంది.
ఎలా పనిచేస్తుంది?
మనకు ఏదైనా దెబ్బ తగిలినప్పుడు, అనారోగ్యం తలెత్తినప్పుడు.. సదరు శరీర భాగాల్లోని నాడులు స్పందించి మెదడుకు సంకేతాలు పంపుతాయి. దానితో ఆయా భాగాల్లో నొప్పి ఉన్నట్టు అనుభూతి కలుగుతుంది. తాజాగా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన పరికరం.. మన చర్మం, దిగువన కండరాల్లోని నాడులను చల్లబర్చడం ద్వారా వాటి నుంచి మెదడుకు వెళ్లే సంకేతాలను నియంత్రిస్తుంది. దీనివల్ల ఆ నాడి తాత్కాలికంగా మొద్దుబారినట్టు అవుతుంది. నొప్పి ఉన్న అనుభూతి ఉండదని పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త జాన్ రోజర్స్ వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఎలుకలపై జరిగిన ప్రయోగాలు ఇప్పటికే మంచి ఫలితాలు ఇచ్చాయని తెలిపారు.
రెండు రసాయనాలతో..
ఐదు మిల్లీమీటర్ల వెడల్పుతో పట్టీలా ఉండే ఈ పరికరంలో అత్యంత సన్నని గొట్టాల వంటి సూక్ష్మ నాళికలు ఉంటాయి. దీనికి అనుసంధానించిన పంపు ద్వారా చల్లబర్చిన పర్ ఫ్లోరో పెంటేన్ అనే రసాయనాన్ని, నైట్రోజన్ ను పంపుతారు. ఈ ద్రవాలు సూక్ష్మ నాళికల ద్వారా ప్రయాణించి నాడులను చల్ల బరుస్తాయి. అంతేకాదు ఈ పరికరాన్ని సహజ సిద్ధంగా డీకంపోస్ అయ్యే పదార్థంతో తయారు చేశారు. మెత్తగా నొప్పి కలిగిన ప్రాంతంలో అమర్చేందుకు వీలుగా ఇది ఉంటుంది. అయితే నొప్పిని తాత్కాలికంగా తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుందని.. నొప్పి పూర్తిగా తగ్గిపోవాలంటే తగిన చికిత్స అవసరం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.