YSRCP: స్పీకర్గా కోడెల శివప్రసాద్కూ వైసీపీ మద్దతు ఇచ్చింది: సజ్జల రామకృష్ణారెడ్డి
- ఢిల్లీలో చక్రం తిప్పాలన్న ధ్యాస లేదన్న సజ్జల
- రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని వెల్లడి
- వెంకయ్య ఉంటే ఎన్టీఏకు టీడీపీ మద్దతిచ్చేది కదా అన్న వైసీపీ నేత
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి తాము మద్దతు ప్రకటించడంపై వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి అభ్యర్థిని ఏకగ్రీవంగానే ఎన్నుకోవాల్సిన అవసరం ఉందన్న సజ్జల... అందుకోసమే వైసీపీ తన మద్దతును ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ప్రకటించిందని తెలిపారు. రాజ్యాంగబద్ధ పదవులను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలన్న ఒకే ఒక్క భావనతోనే ముర్ముకు మద్దతు ప్రకటించామని ఆయన తెలిపారు. అందులో భాగంగానే గతంలో స్పీకర్గా కోడెల శివప్రసాదరావుకు కూడా తాము మద్దతు ఇచ్చామని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా టీడీపీ వైఖరిని తప్పుబట్టిన సజ్జల... ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఉన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికై ఉంటే... ఎన్డీఏ అభ్యర్థికి టీడీపీ మద్దతు ఇచ్చి ఉండేది కదా అని ఆయన అభిప్రాయపడ్డారు. వెంకయ్యను ఎంపిక చేయని కారణంగానే ఎన్డీఏకు కాకుండా విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇచ్చే దిశగా టీడీపీ కదులుతోందని ఆయన ఆరోపించారు. అయినా రాష్ట్రపతి ఎన్నికల్లో ఇప్పటిదాకా చంద్రబాబు తన వైఖరిని ఎందుకు ప్రకటించలేదని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీలో చక్రం తిప్పాలన్న ధ్యాస తమకు ఎంతమాత్రమూ లేదని కూడా సజ్జల మరో ఆసక్తికర కామెంట్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చిన క్రమంలోనే ఎన్డీఏ అభ్యర్థికి తాము మద్దతు ఇచ్చామని ఆయన తెలిపారు.