Prime Minister: స్మృతికి నఖ్వీ శాఖ... సింథియాకూ అదనపు శాఖల కేటాయింపు
- మంత్రి పదవికి రాజీనామా చేసిన నఖ్వీ
- మైనారిటీ వ్యవహారాల శాఖను స్మృతికి కేటాయించిన మోదీ
- ఉక్కు శాఖ సింథియాకు అప్పగింత
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్‌లో బుధవారం పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మోదీ ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన కేబినెట్‌లో మంత్రిగా కొనసాగుతున్న ముక్తార్ అబ్బాస్ నఖ్వీ బుధవారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఉత్తర్ ప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న ఆయన సభ్యత్వం గురువారంతో ముగియనున్న నేపథ్యంలోనే ఆయన రాజీనామా చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా ఆయనను బీజేపీ బరిలోకి దించుతున్న నేపథ్యంలోనే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారన్న వాదనలూ వినిపిస్తున్నాయి.
ఇక, ఇప్పటివరకు నఖ్వీ నిర్వహించిన కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖను మరో మంత్రి స్మృతి ఇరానీకి కేటాయిస్తూ మోదీ నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో గత కొంత కాలంగా ప్రధాని వద్దే ఉన్న కేంద్ర ఉక్కు శాఖను పౌర విమానయాన శాఖ మంత్రిగా కొనసాగుతున్న జ్యోతిరాధిత్య సింథియాకు అదనంగా కేటాయించారు.