Team India: ఆరేళ్ల తర్వాత టాప్‌-10లో కోహ్లీ ర్యాంక్‌ గ‌ల్లంతు!

 Virat Kohli drops out of top10  in test rankings

  • 9 నుంచి 13వ ర్యాంక్‌కు విరాట్‌
  • కెరీర్ అత్యుత్త‌మ ఐదో ర్యాంక్‌కు పంత్‌
  • అగ్రస్థానంలో దూసుకెళ్తున్న రూట్‌

భార‌త క్రికెట్ జ‌ట్లు కెప్టెన్సీ కోల్పోయిన విరాట్ కోహ్లీ కొంత‌కాలంగా బ్యాటుతో నిరాశ ప‌రుస్తున్నాడు. అన్ని ఫార్మాట్ల‌లో అత్యుత్త‌మ బ్యాట‌ర్ల‌లో ఒక‌డిగా పేరు తెచ్చుకున్న కోహ్లీ చాన్నాళ్ల నుంచి ప‌రుగులు చేయ‌డంలో ఇబ్బంది ప‌డుతున్నాడు. త‌న‌కెంతో ఇష్ట‌మైన టెస్టు ఫార్మాట్ లోనూ అత‌ను త‌డ‌బ‌డుతున్నాడు. రెండేళ్ల నుంచి ఒక్క సెంచ‌రీ కూడా కొట్టలేక‌పోయాడు. తాజాగా ఇంగ్లండ్ తో జ‌రిగిన ఐదో టెస్టులోనూ విరాట్ రెండు ఇన్నింగ్స్ ల్లో నిరాశ ప‌రిచాడు. ఈ వైఫ‌ల్యం అత‌ని ర్యాంక్‌పై ప్ర‌భావం చూపింది. 

ఐసీసీ టెస్టు బ్యాట‌ర్ల ర్యాకింగ్స్ లో కోహ్లీ ఆరేళ్ల త‌ర్వాత తొలిసారి టాప్‌10లో చోటు కోల్పోయాడు. మొన్న‌టిదాకా తొమ్మిదో ర్యాంక్‌లో ఉన్న విరాట్ తాజాగా విడుద‌లైన ర్యాంకింగ్స్ లో 13వ స్థానానికి ప‌డిపోయాడు. కరోనా కారణంగా ఇంగ్లండ్‌తో టెస్టుకు దూరంగా ఉన్న భార‌త కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఎనిమిది నుంచి తొమ్మిదో ర్యాంక్‌కు పడిపోయాడు. 

అయితే, యువ వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ టెస్టుల్లో కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌ సాధించాడు. త‌ను ఐదో ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో పంత్‌ సెంచరీ, అర్ధ‌ శ‌త‌కం కొట్టాడు. చివరి ఆరు టెస్టు ఇన్నింగ్స్‌లలో అతను రెండు సెంచరీలు, మూడు హాఫ్‌ సెంచరీలు సాధించాడు. దాంతో, పంత్‌ పది నుంచి ఐదో ర్యాంక్‌ కు చేరుకున్నాడు. 

మరోవైపు ఫుల్‌ ఫామ్‌లో ఉన్న ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్‌ 923 రేటింగ్‌ పాయింట్లతో తన టాప్‌ ర్యాంక్‌ను మరింత బలోపేతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా ఆట‌గాళ్లు లబుషేన్‌, స్టీవ్‌ స్మిత్‌ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. కెరీర్‌ బెస్ట్ ఫామ్‌తో దూసుకెళ్తున్న ఇంగ్లండ్ క్రికెట‌ర్ జానీ బెయిర్‌ స్టో ఏకంగా 11 స్థానాలు మెరుగుపరచుకుని పదో ర్యాంక్‌ సొంతం చేసుకున్నాడు.

  • Loading...

More Telugu News